Updated : 18 Sep 2021 22:28 IST

మిగ్‌ విమాన ప్రమాదంలో పైలట్‌ మృతి

కుప్పకూలిన మిగ్‌ 21..!

ఇంటర్నెట్‌డెస్క్‌: భారతీయ వాయుసేనకు చెందిన మిగ్‌-21 బైసన్‌ విమానం బుధవారం మధ్యాహ్నం కుప్పకూలిపోయింది. గ్వాలియర్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకొంది. యుద్ధ విన్యాసాల శిక్షణ జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో భారత వాయుసేనకు చెందిన గ్రూప్‌ కెప్టెన్‌ ఎ.గుప్తా మృతి చెందారు. ఈ విషయాన్ని వాయుసేన అధికారికంగా ప్రకటించింది. దీనిపై వాయుసేన కోర్ట్‌ ఆఫ్‌ ఎంక్వైరీని ప్రారంభించింది. గత 18 నెలల్లో మిగ్‌-21 శ్రేణి విమానాలు ప్రమాదానికి గురికావడం ఇది మూడోసారి. 2019 సెప్టెంబర్లో ఇదే ఎయిర్‌ బేస్‌లో మిగ్‌21 ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదాల్లో భారత్‌ విమానాలను నష్టపోవడంతోపాటు అత్యంత విలువైన ఫైటర్‌ పైలట్లను కూడా కోల్పోతోంది.

ఫైటర్‌ పైలట్‌ ట్రైనింగ్‌ అంత ఈజీ కాదు..

ఫైటర్‌ పైలట్‌ శిక్షణ అంత తేలిగ్గా ఉండదు. మూడు దశల్లో 285 గంటల కఠిన శిక్షణ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి అంశంలో 100శాతం ప్రదర్శన చేస్తేనే ముందుకు వెళతారు. పైలట్‌ శిక్షణ ఖర్చు బహిర్గతం చేయకపోయినా.. కోట్లల్లోనే ఉంటుంది. ఒక సారి శిక్షణ విమానం గాల్లోకి ఎగరాలంటే చాలా సపోర్టింగ్‌ టీమ్‌లు‌‌ పనిచేయాల్సి ఉంటుంది. రాడార్లు, వాటి నిర్వహణ, ఏటీసీ నిర్వహణ, అత్యంత నిపుణులైన శిక్షకులను ఏర్పాటు చేయడం, రన్‌వేను సిద్ధం చేయడం, లోకల్‌ ఫ్లైయింగ్‌ ఏరియా, సిమ్యూలేటర్లు ఇలా ప్రతి ఒక్కటి అత్యంత ఖర్చుతో కూడుకున్నవి. అన్ని టెక్నాలజీలను సొంతంగా తయారు చేసుకొనే అమెరికా వంటి దేశాల్లోనే ఎఫ్‌-22 రాప్టర్‌ పైలట్‌ శిక్షణ ఖర్చు 10.90 మిలియన్‌ డాలర్లు(ఫోర్బ్స్‌ లెక్కల ప్రకారం). సీ130జే రవాణా విమాన పైలట్‌ శిక్షణ ఖర్చు 2.47 మిలియన్‌ డాలర్లు. భారత్‌ సీ-130 రకం విమానాలను వినియోగిస్తుంది. ఎఫ్‌-16 ఫైటర్‌ జెట్‌ పైలట్‌ శిక్షణ ఖర్చు 5.62 మిలియన్‌ డాలర్లు. భారత్‌లో కూడా శిక్షణకు 2015 లెక్కల ప్రకారం రూ.13 కోట్లు ఖర్చవుతుంది. ఇప్పుడు ఆ విలువ ఇంకా పెరిగి ఉంటుంది. అన్నిటికీ మించి పైలట్‌కు సొంతమయ్యే అనుభవం అత్యంత విలువైనది. దీనికి వెలకట్టలేం.

ప్రమాదం నుంచి బయటపడటమూ కష్టమే..

యుద్ధ విమానాలు కూలిపోతాయి అని తెలిసినప్పుడు పైలట్‌ దానిని ల్యాండ్‌ చేయడానికి చివరి వరకూ ప్రయత్నిస్తాడు. ఇక తప్పదు అనుకున్నప్పుడు విమానం నుంచి ఎజెక్ట్‌ (బయటకు వచ్చేయడం) అవుతాడు. దీనికి పైలట్‌ సీటు కింద రాకెట్‌ ఇంజిన్‌ వంటి ఓ వ్యవస్థ ఉంటుంది. తొలుత పైలట్‌ పైన ఉన్న గ్లాస్‌ను తొలగిస్తాడు. అనంతరం ఆ రాకెట్‌ వ్యవస్థ పనిచేసి పైలట్‌ అత్యంత వేగంతో గాల్లోకి ఎగిరిపోతాడు. ఆ తర్వాత అతడి నుంచి సీటు వేరవుతుంది. అతనికి ఉన్న పారాచూట్‌ తెరుచుకొని కిందకు దిగుతాడు. ఈ పక్రియ అత్యంత వేగంగా జరిగిపోవాలి. ఏ మాత్రం ఆలస్యమైనా.. గాల్లో ప్రయాణిస్తున్న ఆ యుద్ధ విమానం తోకభాగం పైలట్‌ శరీరాన్ని తాకుతుంది. దీంతోపాటు తగినంత ఎత్తులో ఎజెక్ట్‌ కాకపోతే పారాచూట్‌ తెరుచుకునే సమయం లభించక నీటిలో లేదా నేలపై పడిపోతాడు. మరో విషయం ఏంటంటే పైలట్‌ సీటు రాకెట్‌ వేగంతో గాల్లోకి లేవడంతో అతడి వెన్నుపూస దెబ్బతినడం, లేదా తాత్కాలికంగా స్పృహ కోల్పోవడం జరుగుతుంది. అప్పుడు నీటిలో పడినా వెంటనే ఈదలేక ప్రాణాలు కోల్పోతారు. వారి ఆచూకీ తెలుసుకొనేందుకు సూట్‌లో ఓ లొకేటర్‌ ఉంటుంది. అది నీటిలో పడితే పనిచేయదు. దీంతో ఆచూకీ కనుగొనడం కష్టంగా మారుతుంది. ఒక వేళ పైలట్‌ ప్రాణాలతో ఉంటే అతనికి కొంతకాలానికి సరిపడా అత్యంత శక్తిమంతమైన ఆహారం కూడా వారి సూట్‌లో ఉంటుంది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని