S-400: ఎస్‌-400 డెలివరీలు మొదలయ్యాయి: భారత్‌

గగనతల రక్షణ వ్యవస్థ ఎస్‌-400కు సంబంధించిన డెలివరీలను రష్యా ప్రారంభించిన విషయాన్ని భారత్‌ ధ్రువీకరించింది. నిన్న రాత్రి భారత్‌-రష్యా వార్షిక ద్వైపాక్షిక సదస్సు సందర్భంగా ఈ విషయం

Published : 08 Dec 2021 01:37 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: గగనతల రక్షణ వ్యవస్థ ఎస్‌-400కు సంబంధించిన డెలివరీలను రష్యా ప్రారంభించిన విషయాన్ని భారత్‌ ధ్రువీకరించింది. నిన్న రాత్రి భారత్‌-రష్యా వార్షిక ద్వైపాక్షిక సదస్సు సందర్భంగా ఈ విషయం వెల్లడించింది. విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్థన్‌ శ్రింగ్లా మాట్లాడుతూ ‘‘సరఫరాలు ఈ నెలలో మొదలయ్యాయి. అవి కొనసాగుతాయి’’ అని ముక్తసరిగా వెల్లడించారు. ఆయన ఎస్‌-400 పేరును నేరుగా ప్రస్తావించకపోవడం గమనార్హం.

భారత్‌ గగనతల రక్షణ కోసం 5.5 బిలియన్‌ డాలర్లు వెచ్చించి 2018లో ఎస్‌400లను కొనుగోలు చేయాలని నిర్ణయించి రష్యాతో ఒప్పందంపై సంతకాలు చేసింది. వాటికి సంబందించిన డెలివరీలు గత నెలలో మొదలైనట్లు రష్యా ప్రతినిధి ఒకరు దుబాయ్‌లో జరిగిన ఎయిర్‌షోలో వెల్లడించారు. భారత్‌ ఈ విషయంపై పెదవి విప్పలేదు. తాజాగా శ్రింగ్లా ప్రకటన దానిని ధ్రువీకరిస్తోంది. ఇక వీటి కొనుగోళ్లను వ్యతిరేకిస్తూ కాట్సా ఆంక్షలు విధిస్తుందనే ప్రచారం జరుగుతోంది. కానీ, అమెరికా నుంచి మాత్రం స్పష్టమైన ప్రకటన వెలువడలేదు. ఇప్పటికే ఎస్‌-400 కొనుగోలు చేసిన టర్కీ, చైనాలపై ఈ చట్టం కింద ఆంక్షలు విధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని