
JK: హిమపాతంలో చిక్కుకున్న 30మందిని కాపాడిన సైన్యం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో భారీగా కురుస్తున్న హిమపాతం రహదారుల్ని కప్పేస్తుండటంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సోమవారం రాత్రి చౌకీబాల్- టాంగ్‌ధర్ రహదారిలో హిమపాతం కారణంగా చిక్కుకుపోయిన 30మంది పౌరులను భారత సైనిక బృందాలు కాపాడాయి. ఖూనీ నాలా, ఎస్.ఎం.హిల్ ప్రాంతాల్లో మంచు తుపాను భారీగా కురవడంతో కొందరు ప్రయాణికుల వాహనాలు చిక్కుకుకుపోయాయి. దీంతో సమాచారం అందుకున్న ఎన్‌సీ పాస్‌లోని సైనిక బలగాలు అప్రమత్తమయ్యాయి. రెండు సైనిక సహాయక బృందాలతో పాటు జనరల్ రిజర్వ్ ఇంజినీర్ ఫోర్స్ (జీఆర్‌ఈఎఫ్) బృందం రంగంలోకి దిగాయి.
గడ్డకట్టిన మంచుతో తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ దాదాపు ఆరు గంటల పాటు శ్రమించి వారందరినీ కాపాడారు. 14 మందిని నీలమ్‌కు, మరో 16 మంది పౌరులను సాధ్నా పాస్‌గా పిలవబడే ఎన్‌పీ పాస్‌కు తరలించినట్టు చెప్పారు. ఆ పౌరులందరికీ నిన్న రాత్రి ఆహారం, వైద్య సాయంతో పాటు ఆశ్రయం కల్పించారు. చౌకిబాల్-టాంగ్‌ధర్ (ఎన్‌హెఎచ్ 701) రహదారిపై మంచు గడ్డల్ని తొలగించడంతో ఇప్పటివరకు దాదాపు 12 వాహనాలు వెళ్లాయని అధికారులు తెలిపారు. గతేడాది కూడా ఖూనీ నాలా వద్ద చిక్కుకుపోయిన పౌరుల్ని సైనిక బలగాలు కాపాడిన విషయం తెలిసిందే.