తొలి మొబైల్‌ సీఎన్‌జీ రీఫ్యూయల్‌ అందుబాటులోకి

తొలుత దిల్లీ, ముంబయి నగరాల్లో ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది

Published : 09 Jun 2021 23:55 IST

* ప్రారంభించిన కేంద్ర పెట్రోలియా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌

దిల్లీ: ఇప్పటి వరకూ మొబైల్‌ ఫుడ్‌ ట్రక్కులు, మొబైల్‌ లైబ్రరీలు, మొబైల్‌ టాయిలెట్లు గురించి విన్నాం. అయితే మొబైల్‌ సీఎన్‌జీ రీఫ్యూయల్‌ గురించి విన్నారా? మన దేశంలో ఇప్పటి వరకు సహజవాయువును ఈ పద్ధతిలో అందించే ప్రక్రియ జరగలేదు.  మొబైల్‌ సీఎన్‌జీ రీఫ్యూయల్‌ యూనిట్లను కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ప్రారంభించారు. తొలుత దిల్లీ, ముంబయి నగరాల్లో ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. టైప్‌- 4 కంపోజిట్‌ సిలిండర్ల ద్వారా ఇంద్రప్రస్థా గ్యాస్‌ లిమిటిడ్‌, మహానగర్‌ గ్యాస్‌ ఈ సేవలు అందిస్తున్నాయి. సహజవాయువు పైప్‌లైన్లు అందుబాటులో లేని ప్రాంతాలు,  సీఎన్‌జీ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి భూమి కొరత ఉన్న ప్రదేశాలలో ఈ మొబైల్‌ రీఫ్యూయలింగ్‌ యూనిట్‌  (MRU) ఎంతగానో ఉపయోగపడుతాయి.  ఇంటివద్దకే సీఎన్‌జీ డెలివరీ చేయనున్నారు. ఇందుకోసం ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవని కేంద్రమంత్రి వెల్లడించారు. ఈ మొబైల్‌ యూనిట్‌లో 1,500 కిలోల సీఎన్‌జీ నిల్వచేసుకునే సామర్థ్యం ఉండటంతో.. రోజుకు 150 నుంచి 200 వాహనాలకు నింపొచ్చు. ఈ మొబైల్‌ యూనిట్లతో పాటు దేశవ్యాప్తంగా 201 సీఎన్‌జీ స్టేషన్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఒకే చోట ప్రయాణానికి వినియోగించే ఇంధనాలైన హైడ్రోజన్‌, డిజిల్‌, పెట్రోల్, సీఎన్జీ సీబీజీ, ఎల్‌న్జీ ఈవీ బ్యాటరీలు మార్పిడి చేసుకునే వెసులుబాటు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం. పరిశుభ్రమైన వాతావరణం కోసం  డీజిల్, పెట్రోల్ వాహనాలను సీఎన్‌జీ, ఎల్‌ఎన్‌జీగా మార్చాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రస్తుత డీజిల్‌, పెట్రోల్‌కి ప్రత్యామ్నాయంగా మొబైల్ బ్యాటరీ వినియోగం పెరిగేలా మార్గాలు అన్వేషించాలి’’ అని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని