Aditya-L1: సూర్యుడిపై పరిశోధనలు.. ‘ఆదిత్య ఎల్‌-1’కు ముహూర్తం ఖరారు!

సూర్యుడిపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) తొలిసారిగా చేపడుతోన్న ‘ఆదిత్య ఎల్‌-1’ ప్రయోగానికి ముహూర్తం ఖరారయ్యింది.

Updated : 28 Aug 2023 18:34 IST

బెంగళూరు: సూర్యుడిపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) మరో కీలక మిషన్‌కు సిద్ధమైంది. ఇందుకోసం రూపొందించిన ‘ఆదిత్య ఎల్‌-1’ను సెప్టెంబర్‌ 2న ఉదయం 11.50 గంటలకు శ్రీహరి కోట నుంచి ప్రయోగించనున్నట్లు తెలిపింది. దీనిని పీఎస్‌ఎల్‌వీ-సి57 రాకెట్‌ నింగిలోకి మోసుకెళ్లనుంది. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఇస్రో చేపడుతున్న తొలి మిషన్‌ ఇదే కావడం విశేషం. కరోనాగ్రఫీ పరికరం సాయంతో సౌర వాతావరణాన్ని లోతుగా పరిశోధించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం. యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ, ఆస్ట్రేలియా, ఇతర దేశాల అంతరిక్ష సంస్థల సాయంతో సూర్యుడిపై అధ్యయనాలను ఇస్రో చేపడుతోంది. ప్రయోగాన్ని వీక్షించేందుకు సాధారణ పౌరులకు అవకాశం కల్పిస్తున్నట్టు ఇస్రో పేర్కొంది. ఇందుకోసం ఆగస్టు 29 (మంగళవారం) మధ్యాహ్నం 12 గంటల నుంచి ఇస్రో వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని తెలిపింది.

చందమామ ఉపరితలంపై ఉష్ణోగ్రత ఎంతంటే..

ఆదిత్య-ఎల్‌ 1 (Aditya-L1) విశేషాలివే..

  • సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఇస్రో చేపడుతున్న తొలి మిషన్‌ ఇది. ఇందులోని శాటిలైట్‌ బరువు 1500 కిలోలు.
  • భూమి (Earth) నుంచి సూర్యుని దిశగా 15లక్షల కిలోమీటర్ల దూరంలోని లాగ్రాంజ్‌ పాయింట్ 1 (ఎల్‌ 1) చుట్టూ ఉన్న కక్ష్యలో దీన్ని ప్రవేశపెట్టనున్నారు. తద్వారా గ్రహణాలతో సంబంధం లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేసేందుకు వీలు లభిస్తుంది.
  • ఆదిత్య-ఎల్‌ 1 (Aditya-L1) మొత్తం ఏడు పేలోడ్లను మోసుకెళ్లనుంది. ఇందులో ప్రధానమైన ‘విజిబుల్‌ ఎమిషన్‌ లైన్‌ కొరోనాగ్రాఫ్‌ (వీఈఎల్‌సీ)తో పాటు సోలార్‌ అల్ట్రావైలెట్‌ ఇమేజింగ్‌ టెలిస్కోప్‌, ఆదిత్య సోలార్‌ విండ్‌ పార్టికల్‌ ఎక్స్‌పెరిమెంట్‌, ప్లాస్మా అనలైజర్‌ ప్యాకేజ్‌ ఫర్‌ ఆదిత్య, సోలార్‌ లో ఎనర్జీ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్‌, హైఎనర్జీ ఎల్‌-1 ఆర్బిటింగ్‌ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్‌, మాగ్నెటోమీటర్‌ పేలోడ్‌లను అమర్చనున్నారు.
  • సూర్యగోళం నుంచి ప్రసరించే అత్యంత శక్తిమంతమైన కాంతి ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు అనువుగా ఈ పేలోడ్‌లను రూపొందించారు. ఈ పేలోడ్లు ఎలక్ట్రోమాగ్నెటిక్‌, మాగ్నెటిక్‌ ఫీల్డ్‌ డిటెక్టర్ల సాయంతో సూర్యుడిలోని పొరలైన ఫొటోస్పియర్‌, క్రోమోస్పియర్‌, వెలుపల ఉండే కరోనాను అధ్యయనం చేస్తాయి.
  • ఎల్‌-1 ప్రదేశానికి ఉన్న సానుకూలతల దృష్ట్యా నాలుగు పరికరాలు నేరుగా సూర్యుడిని అధ్యయనం చేస్తాయి. మిగతా మూడు సాధనాలు.. సమీపంలోని సౌర రేణువులు, అయస్కాంత క్షేత్రాల గురించి శోధిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని