IndiGo: ఎమర్జెన్సీ డోరు తెరిచిన ప్రయాణికుడు.. విమానంలో కలకలం!

ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోరు తెరిచిన ఘటన కలకలం సృష్టించింది. గతేడాది డిసెంబరు 10న ఇది చోటుచేసుకోగా తాజాగా డీజీసీఏ దీనిపై విచారణకు ఆదేశించింది.

Updated : 17 Jan 2023 17:03 IST

చెన్నై: కొన్నాళ్లుగా వరుసగా విమాన సంబంధిత ఘటనలు చర్చనీయాంశమవుతోన్న వేళ.. తాజాగా మరో వ్యవహారం బయటకువచ్చింది. విమానంలో అత్యవసర ద్వారం(Emergency Door) తెరిచి ఓ ప్రయాణికుడు కలకలం సృష్టించాడు. గతేడాది డిసెంబరు 10న ఇండిగో(IndiGo)కు చెందిన చెన్నై - తిరుచిరాపల్లి విమానం టేకాఫ్‌కు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే బోర్డింగ్‌ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఓ ప్రయాణికుడు అనుకోకుండా ఎమర్జెన్సీ డోర్‌ తెరిచాడు. దీంతో విమానంలోని ఇతర ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే, వెంటనే అప్రమత్తమైన సిబ్బంది పరిస్థితిని చక్కదిద్దారు. విమానం లోపల పీడనం సరిచూసుకుని‌, ఇతర తనిఖీల అనంతరం విమానం బయల్దేరింది.

ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించినట్లు డీజీసీఏ(DGCA) తాజాగా వెల్లడించింది. ఇదిలా ఉండగా.. ఎయిర్‌ ఇండియా విమానంలో తోటి మహిళా ప్రయాణికురాలిపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేసిన ఘటన ఇటీవల తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. గో ఫస్ట్‌ విమానం 50 మందిని వదిలిపెట్టి టేకాఫ్‌ తీసుకోవడం, ఎయిర్‌ ఇండియా విమానంలో భోజనంలో రాళ్లు, మద్యం మత్తులో మరుగుదొడ్ల గదిలో పొగతాగడం వంటి ఘటనలూ వార్తల్లో నిలిచాయి. ఈ క్రమంలోనే విమానంలో అనుచితంగా ప్రవర్తించే ప్రయాణికులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీసీఏ ఇటీవల విమానయాన సంస్థలకు సూచించింది. లేనిపక్షంలో విమాన సిబ్బందిపై చర్యలు ఉంటాయని హెచ్చరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని