INS Vikrant: ‘ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌’పై యుద్ధవిమానం ల్యాండింగ్‌

‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ దిశగా నౌకాదళం చారిత్రక మైలురాయి దాటింది. భారత్‌ తొలి స్వదేశీ విమాన వాహక నౌక ‘ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌’పై తొలిసారి ఓ నౌకాదళ స్వదేశీ యుద్ధ విమానం ల్యాండ్‌ అయింది.

Published : 06 Feb 2023 20:08 IST

దిల్లీ: భారత మొట్టమొదటి స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌(INS Vikrant) కీలక మైలురాయి దాటింది. నౌకాదళ(Navy) స్వదేశీ తేలికపాటి యుద్ధ విమానం(LCA) ఒకటి గురువారం ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌పై తొలిసారి ల్యాండ్‌ అయింది. ఓ ఫిక్స్‌డ్ వింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ ఈ నౌకపై ల్యాండ్‌ కావడం కూడా ఇదే మొదటిసారి.

‘ఐఎస్‌ఎస్‌ విక్రాంత్‌పై నావికాదళ పైలట్లు తేలికపాటి యుద్ధవిమానాన్ని(నేవీ) విజయవంతంగా ల్యాండ్‌ చేశారు. దీని ద్వారా ఆత్మనిర్భర్ భారత్ దిశగా నౌకాదళం మరో చారిత్రక మైలురాయి దాటింది’ అని భారత నౌకాదళం ఓ ప్రకటనలో తెలిపింది. స్వదేశీ విమాన వాహక నౌకలు, యుద్ధ విమానాల రూపకల్పన, నిర్మాణం, నిర్వహణ విషయంలో భారత్‌ సామర్థ్యాన్ని ఇది ప్రదర్శిస్తుందని పేర్కొంది.

రూ.20 వేల కోట్ల వ్యయంతో నిర్మించిన ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ను గతేడాది సెప్టెంబర్‌లో నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. 262 మీటర్ల పొడవు, 62 మీటర్ల వెడల్పుతో ఐఎన్‌ఎస్‌ విక్రాంత్ భారత్‌లో నిర్మించిన అతిపెద్ద యుద్ధనౌక. మిగ్‌-29కే, హెలికాప్టర్‌లతో సహా 30 యుద్ధ విమానాలను ఇది మోసుకెళ్లగలదు. ప్రస్తుతం ఈ యుద్ధనౌకపై ఏవియేషన్‌ ట్రయల్స్‌ నిర్వహిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని