అబె వారసుడిగా యోషిహిదే సుగా!

జపాన్‌ తదుపరి ప్రధానిగా ఆ దేశ క్యాబినెట్‌ ముఖ్య కార్యదర్శి యోషిహిదే సుగా(71) పదవీ బాధ్యతలు స్వీకరించడం లాంఛనమైంది. అధికార లిబరల్‌ డెమోక్రాటిక్‌ పార్టీ(ఎల్‌డీపీ) అధినేత ఎన్నిక కోసం జరిగిన ఎన్నికల్లో ఆయన తిరుగులేని మెజార్టీ సాధించారు. బుధవారం జపాన్‌ పార్లమెంట్‌ డైట్‌లో.........

Published : 15 Sep 2020 01:06 IST

టోక్యో: జపాన్‌ తదుపరి ప్రధానిగా ఆ దేశ క్యాబినెట్‌ ముఖ్య కార్యదర్శి యోషిహిదే సుగా(71) పదవీ బాధ్యతలు స్వీకరించడం లాంఛనమైంది. అధికార లిబరల్‌ డెమోక్రాటిక్‌ పార్టీ(ఎల్‌డీపీ) అధినేత ఎన్నిక కోసం జరిగిన ఎన్నికల్లో ఆయన తిరుగులేని మెజార్టీ సాధించారు. బుధవారం జపాన్‌ పార్లమెంట్‌ డైట్‌లో జరిగే ఓటింగ్‌ అనంతరం ఆయన ప్రధానిగా బాధ్యతలు స్వీకరిస్తారు. సుగా ప్రస్తుత ప్రధాని షింజో అబెకు సహాయకుడిగా, అధికార ప్రతినిధిగా, ముఖ్య అనుచరుడిగా వ్యవహరించారు. కరోనా వైరస్‌ క్లిష్టకాలం, పలు విధాన నిర్ణయాలు అమలుపర్చాల్సిన తరుణంలో సుగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ప్రపంచమంతా ఆర్థికంగా తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంటున్న తరుణంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న జపాన్‌ను ముందుకు నడిపే బాధ్యత సుగాపై ఉంది. అబె చేపట్టిన అనేక సంస్కరణల వెనుక సుగా హస్తం ఉన్నట్లు చెబుతుంటారు. సుగాను ఎన్నుకోవడం ద్వారా అబె విధానాలకు ఎల్‌డీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించినట్లైంది. అమెరికాతో సఖ్యత, భారత్‌తో మైత్రి, బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌ ఉద్దీపనలు అమలు పరచడం వంటి విధానాల్లో పెద్దగా మార్పు ఉండే అవకాశం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. 

అనారోగ్యం కారణంగా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రస్తుత ప్రధాని షింజో అబె ప్రకటించిన విషయం తెలిసిందే. తాను కొంతకాలంగా పెద్దపేగు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. జపాన్‌ చరిత్రలో అత్యంత ఎక్కువకాలం పాలించిన ప్రధానిగా అబె ఖ్యాతి గడించారు. ఏడాది పాటు పదవీకాలం మిగిలుండగానే రాజీనామాకు సిద్ధమయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని