Sunjwan attack: ప్రధాని పర్యటనే లక్ష్యంగా అఫ్గాన్‌ నుంచి ఉగ్రవాదులు..?

ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను లక్ష్యంగా చేసుకొని అఫ్గానిస్థాన్‌ నుంచి ఉగ్రవాదులను జైషే సంస్థ రంగంలోకి దింపినట్లు భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి. ఈ కుట్రలో భాగంగానే ఇద్దరు ఆత్మాహుతి దళ సభ్యులు సుంజ్వాన్‌లోకి చొరబడినట్లు జమ్ముకశ్మీర్‌ అడిషనల్‌

Published : 24 Apr 2022 15:52 IST

 సుంజ్వాన్‌ ఎన్‌కౌంటర్లో వెలుగులోకి వస్తున్న షాకింగ్‌ విషయాలు

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను లక్ష్యంగా చేసుకొని అఫ్గానిస్థాన్‌ నుంచి ఉగ్రవాదులను జైషే సంస్థ రంగంలోకి దింపినట్లు భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి. ఈ కుట్రలో భాగంగానే ఇద్దరు ఆత్మాహుతి దళ సభ్యులు సుంజ్వాన్‌లోకి చొరబడినట్లు జమ్ముకశ్మీర్‌ అడిషనల్‌ డీజీపీ ముఖేష్‌ సింగ్‌ వెల్లడించారు. ఏప్రిల్‌ 22వ తేదీన జరిగిన ఎన్‌కౌంటర్‌లో వీరిని మట్టుబెట్టినట్లు పేర్కొన్నారు. ప్రధాని పర్యటన వేళ వీలైనంత ఎక్కువ మంది భద్రతా సిబ్బందిని హత్యచేయడమే లక్ష్యంగా వీరు పనిచేసినట్లు వెల్లడించారు. ఈ ముష్కరులకు స్థానికుల నుంచి మద్దతు అందిందని పేర్కొన్నారు. వీరికి సహకరించిన ఇద్దరిని ఇప్పటికే అరెస్టు చేశారు. 

పష్తూన్‌ తప్ప మరోభాష తెలియని ముష్కరులు..

ఈ కేసుకు సంబంధించి షఫీక్‌ అహ్మద్‌ షేక్‌, ఇక్బాల్‌ అహ్మద్‌లను అరెస్టు చేశారు. సుంజ్వాన్‌ ఎన్‌కౌంటర్‌ సమయంలో ఉగ్రవాదులు పాకిస్థాన్‌లో ఉన్న వారి కమాండర్‌తో మాట్లాడేందుకు షఫీక్‌కు ఫోనును వినియోగించారు. అదే సమయంలో భద్రతా ఏర్పాట్లపై ఆరా తీయాలని షఫీక్‌కు వారు సూచించారు.

ఆ ఇద్దరు ఉగ్రవాదులు ఎన్‌కౌంటర్‌కు ముందు భారత్‌లోకి చొరబడినట్లు  భావిస్తున్నారు. వీరిద్దరు సాంబలో షఫీక్‌ ఏర్పాటు చేసిన కాయగూరల ట్రక్కు ఎక్కి సుంజ్వాన్‌ చేరుకొన్నారు. ఈ ఇద్దరు ఉగ్రవాదులకు కశ్మీరీ, ఉర్దూ, డోగ్రి, హిందీ మాట్లడటం రాదని ఇంటరాగేషన్‌లో షఫీక్‌ వెల్లడించాడు. వారు కేవలం పష్తూన్‌ మాత్రమే మాట్లాడుతున్నారని చెప్పాడు. పాక్‌-అఫ్గాన్‌ సరిహద్దుల్లోని ఖైబర్‌ పక్తూన్‌ఖ్వా లేదా అఫ్గానిస్థాన్‌ నుంచి వీరు వచ్చినట్లు చెప్పాడు. 

పాగల్‌ జమాత్‌ పేరిట టెలిగ్రామ్‌ ఖాతాతో..

ఈ కుట్రలో ఆసీఫ్‌ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. అతడు షఫీక్‌ కోసం ఫోన్‌, సిమ్‌ కార్డులను కొనుగోలు చేశాడు. దీంతోపాటు సోదరుడి కోసం ‘పాగల్‌జమాత్‌’ పేరిట టెలిగ్రామ్‌ ఖాతాను తెరిచాడు. షఫీక్‌ ఈ ఖాతాతోనే పాకిస్థాన్‌లో జైషే అహ్మద్‌ కమాండర్‌తో టచ్‌లోకి వెళ్లాడు. ‘వీర్‌’పేరిట ఆ కమాండర్‌ టెలిగ్రామ్‌ ఖాతా ఉంది. ఆ కమాండరే ఆత్మాహుతి దళ సభ్యులను జమ్ముకు చేర్చాలని షఫీక్‌ను ఆదేశించాడు. 

* ఉగ్రవాదులను తరలించడానికి వినియోగించిన ట్రక్కును కూడా దర్యాప్తు సంస్థ స్వాధీనం చేసుకొంది. ఈ ట్రక్కు అనంతనాగ్‌ ప్రాంతానికి చెందిన బిలాల్‌ అహ్మద్‌ వాఘే అనే వ్యక్తిదిగా గుర్తించారు. బిలాల్‌ ఏప్రిల్‌ 21వ తేదీన అర్ధరాత్రి సాంబా జిల్లాలోని సుఖ్వాల్‌ ప్రాంతానికి వెళ్లి ఉగ్రవాదులను ట్రక్కులోని కూరగాయల పెట్టెల మధ్యలో ఏర్పాటు చేసిన రహస్య ఖాళీల్లో కూర్చొబెట్టుకొని జమ్ములోని జలాలాబాద్‌ చేర్చాడు. అక్కడ షఫీక్‌ వీళ్లను రిసీవ్‌ చేసుకొన్నాడు. 

సాంకేతిక అంశాలను విశ్లేషించాకే షఫీక్‌‌, ఇక్బాల్‌లను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడిస్తున్నారు. దక్షిణ కశ్మీర్‌లోని త్రాల్‌ ప్రాంతానికి చెందిన షఫీక్‌ జమ్ములో ఒక వాల్‌నట్‌ ఫ్యాక్టరీ పనిచేస్తున్నాడు. ఈ కేసులో అరెస్టైన ఇక్బాల్‌ దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాం ప్రాంతానికి చెందినవాడు. ఇతడు జమ్ములోని జలాలాబాద్‌లో ఉంటున్నాడు. ఇతడి ఇంటిలోనే షఫీక్‌ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చారు. అక్కడ వారు ఉదయం మొత్తం దాడి వ్యూహాల గురించి చర్చించారు. కానీ,  ఉగ్రవాదులు జమ్ములోకి ప్రవేశించినట్లు భద్రతా దళాలకు సమాచారం అందడంతో అప్రమత్తమై తనఖీలు మొదలుపెట్టారు. అంతేకాదు.. ఈ కుట్రను భగ్నం చేసే క్రమంలో భారీగా ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకొన్నారు. ఈ కేసుకు సంబంధించి ఆసీఫ్‌, బిలాల్‌ పరారీలో ఉన్నారు. వారి కోసం దళాల వేట కొనసాగుతోంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని