
Kangana Ranaut: నా వ్యాఖ్యలు తప్పని నిరూపిస్తే.. పద్మశ్రీ వెనక్కిస్తా: కంగన
ఇంటర్నెట్‌డెస్క్: భారత్‌కు నిజమైన స్వాతంత్య్రం 2014లో వచ్చిందని, 1947లో వచ్చింది భిక్ష మాత్రమేనని పేర్కొంటూ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగుతోంది. స్వాతంత్ర్య సమరయోధులను అవమానించిన కంగనను అరెస్టు చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే విమర్శలు ఎదురవుతున్నా.. ఆమె మాత్రం తన వ్యాఖ్యలను మరోసారి సమర్థించుకున్నారు. అంతేగాక, తాను చేసిన వ్యాఖ్యలు తప్పని నిరూపిస్తే ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేస్తానంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో రాసుకొచ్చారు.
కంగన శనివారం తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ‘జస్ట్ టు సెట్ ది రికార్డ్స్ స్ట్రేట్’ అనే పుస్తకంలోని పేజీలను షేర్ చేస్తూ.. ‘‘కాంగ్రెస్‌ను విమర్శిస్తున్నది నేను ఒక్కదాన్నే కాదు. ఆ ఇంటర్వ్యూ(కంగన మాట్లాడిన కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ)లో నేను అన్నీ స్పష్టంగా చెప్పాను. 1857లో తొలిసారిగా స్వాతంత్ర్యం కోసం ఉమ్మడి పోరాటం జరిగింది. ఈ పోరాటంలో రాణి లక్ష్మీబాయి తదితరులు ప్రాణాలర్పించారు. అనంతరం స్వాతంత్ర్య పోరాటంలో సుభాష్ చంద్రబోస్, వీర్ సావర్కర్ లాంటి వారు ఎన్నో త్యాగాలు చేశారు. రాణీ లక్ష్మీబాయి జీవిత చరిత్రపై తీసిన చిత్రంలో నేను నటించాను. అందుకోసం 1857లో జరిగిన తొలి స్వాతంత్ర్య పోరాటంపై విస్తృత పరిశోధన చేశాను. అప్పుడు జాతీయవాదం పెరిగింది. కానీ ఒక్కసారిగా ఎందుకు తగ్గిపోయింది? భగత్‌సింగ్ ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? వారికి గాంధీ ఎందుకు మద్దతు ఇవ్వలేదు? విభజన రేఖను శ్వేత జాతీయుడు ఎందుకు గీయాల్సి వచ్చింది? స్వాతంత్ర్యాన్ని వేడుక చేసుకోవాల్సింది మాని.. మత కలహాలకు ఎందుకు పాల్పడ్డారు? ఈ ప్రశ్నలకు నేను సమాధానం తెలుసుకోవాలనుకుంటున్నాను. 1857లో జరిగిన యుద్ధం గురించి నాకు తెలుసు. కానీ 1947లో ఏం జరిగింది. దీని గురించి ఎవరైనా నాకు హితబోధ చేస్తే తప్పకుండా నా పద్మశ్రీని వెనక్కి ఇచ్చి.. అందరికీ క్షమాపణ చెబుతాను’’ అంటూ కంగన రాసుకొచ్చారు.
‘‘భౌతికంగా మనకు స్వాతంత్ర్యం ఎప్పుడో వచ్చింది. కానీ భారతీయుల మనస్సాక్షికి మాత్రం 2014లో స్వేచ్ఛ లభించిందని నేను ఆ ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పాను. 2014లో మన నాగరికతకు మళ్లీ జీవం వచ్చి రెక్కలు చాచి ఎగురుతోంది. ఇప్పుడు ఇంగ్లిష్ మాట్లాడనందుకు, చిన్న ప్రాంతాల నుంచి వచ్చినందుకు, మేడ్ ఇన్ ఇండియా వస్తువులను ఉపయోగించేందుకు ఎవరూ సిగ్గుపడట్లేదు. ఈ విషయాలన్నీ నేను ఇంటర్వ్యూలో స్పష్టంగా వివరించాను. కేవలం ఎడిట్ చేసిన వీడియో క్లిప్‌లను వైరల్ చేసి విమర్శలు చేయడం కాదు.. మొత్తం ఎపిసోడ్ చూపించి మాట్లాడండి. నిజాలు మాట్లాడేందుకు, వాటి పరిణామాలను ఎదుర్కొనేందుకు నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. ఇక ఆ ఇంటర్వ్యూలో నేను అమరవీరులను అవమానించినట్లు ఎవరైనా నిరూపిస్తే నా పద్మశ్రీని వెనక్కి ఇచ్చేస్తాను’’ అని కంగన తెలిపారు.