Plane crashes: హెలికాప్టర్‌ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన ప్రముఖులు

దేశంలోని త్రివిధ దళాలకు సమన్వయకర్తగా వ్యవహరించే చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్ స్టాఫ్‌ (సీడీసీ) బిపిన్‌ రావత్‌ హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించడం యావత్‌ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.

Published : 08 Dec 2021 18:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలోని త్రివిధ దళాలకు సమన్వయకర్తగా వ్యవహరించే చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్ స్టాఫ్‌ (సీడీసీ) బిపిన్‌ రావత్‌ హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించడం యావత్‌ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన ప్రయాణిస్తున్న వాయుసేనకు చెందిన హెలికాప్టర్‌ ప్రమాదానికి గురవ్వడంతో ఆయన, ఆయన కుటుంబ సభ్యులు సహా హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న 13 మంది మరణించారు. గతంలో దేశంలో జరిగిన విమాన/ హెలికాప్టర్‌ ప్రమాదాలు పలువురు ప్రముఖుల ప్రాణాలను బలితీసుకున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి, స్పీకర్‌ జీఎంసీ బాలయోగి, సంజయ్‌ గాంధీ తదితరులు ఉన్నారు.

వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే హెలికాప్టర్‌ ప్రమాదంలో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి మృతి చెందారు. 2009 సెప్టెంబర్‌ 2న చిత్తూరు జిల్లా పర్యటనకు బయల్దేరి వెళుతుండగా.. ఆయన ప్రయాణిస్తున్న బెల్‌ 430 హెలికాప్టర్‌ నల్లమల అడవుల్లో కుప్పకూలిపోయింది. ఆయన సహా మొత్తం ఐదుగురు ఆ ప్రమాదంలో మరణించారు.

జీఎంసీ బాలయోగి: లోక్‌సభ స్పీకర్‌, తెలుగుదేశం పార్టీ నేత జీఎంసీ బాలయోగి హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించారు. 2002 మార్చి 3న ఆయన ప్రయాణిస్తున్న బెల్‌ 206 హెలికాప్టర్‌ పశ్చిమ గోదావరి జిల్లాలో కుప్పకూలిపోయింది.

ధోర్జీ ఖండూ: అరుణాచల్‌ ప్రదేశ్‌ సీఎం ధోర్జీ ఖండూ హెలికాప్టర్‌ ప్రమాదంలో 2011 ఏప్రిల్‌ 30న మరణించారు. ఆయన ప్రయాణిస్తున్న పవన్‌ హాన్స్‌ బీ8 మోడల్‌ హెలికాప్టర్‌ అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌ వద్ద ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు.

మాధవరావు సింథియా: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ప్రస్తుత పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింథియా తండ్రి మాధవరావు సింథియా విమాన ప్రయాదంలో మృతిచెందారు. 2001 సెప్టెంబర్‌ 30న కాన్పూర్‌లో జరిగిన ఈ ఘటనలో సింథియా సహా ఏడుగురు మరణించారు.

సంజయ్‌ గాంధీ: 1980 జూన్‌ 23న దిల్లీలో సఫ్దర్‌జంగ్‌ విమానాశ్రయంలో జరిగిన విమాన ప్రమాదంలో సంజయ్‌ గాంధీ మరణించారు. కాంగ్రెస్‌ నేత, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చిన్న కుమారుడాయన.

ఓపీ జిందాల్‌: హరియాణాకు చెందిన మంత్రి ఓపీ జిందాల్‌ 2005 మార్చి 31న మరణించారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ ఉత్తర్‌ప్రదేశ్‌లోని షెహరాన్‌పూర్‌ వద్ద కుప్పకూలిపోయింది.

సౌందర్య: తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమైన సౌందర్య కూడా హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించారు. 2004 ఏప్రిల్‌ 17న బెంగళూరులో ఈ ప్రమాదం జరిగింది. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం సహా పలు భాషల్లో ఆమె నటించారు.

* స్వాతంత్ర సమరయోధుడు సుభాష్‌ చంద్రబోస్‌ 1945 ఆగస్టు 18న విమాన ప్రమాదంలో మరణించారు. ప్రమాద విషయంలో ఇప్పటికీ స్పష్టత రాకపోవడం గమనార్హం.

* వీరితో పాటు కాంగ్రెస్‌ నేత ఎస్‌ మోహన్‌కుమార్‌ మంగళం, పంజాబ్‌ గవర్నర్‌ సురేంద్ర నాథ్‌, కేంద్ర రక్షణ శాఖ సహాయమంత్రి ఎన్‌వీఎన్‌ సోము, అరుణాచల్‌ ప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి డేడా నటుంగ్‌ తదితరులు ఈ తరహా ప్రమాదాల్లోనే ప్రాణాలు కోల్పోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని