Omicron Wave: థర్డ్‌వేవ్‌ కట్టడికి.. మూడు ముఖ్యమైన మార్గాలివే..!

దేశంలో ఒమిక్రాన్‌ ఉద్ధృతి కొనసాగుతున్న వేళ.. ప్రతిఒక్కరూ కొవిడ్‌ నిబంధనలు పాటించడం, అర్హులందరికీ వ్యాక్సిన్‌ పంపిణీ చేయడం అనేవి రెండు ముఖ్యమైన అంశాలు.

Published : 12 Jan 2022 01:43 IST

కొవిడ్‌ వర్కింగ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ ఎన్‌.కే అరోడా

దిల్లీ: దేశవ్యాప్తంగా కొవిడ్‌ ఉద్ధృతి రోజురోజుకు పెరుగుతోంది. పది రోజుల క్రితం నిత్యం 10 నుంచి 15వేలుగా నమోదైన కేసుల సంఖ్య ప్రస్తుతం లక్షా 60వేలకు చేరింది. ముఖ్యంగా చాలా రాష్ట్రాల్లో వైరస్‌ వ్యాప్తి గణనీయంగా పెరగడానికి ఒమిక్రాన్‌ వేరియంట్‌ కారణం కావచ్చని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో థర్డ్‌వేవ్‌ వ్యాప్తిని కట్టడి చేయాలంటే మూడు అంశాలు ఎంతో ముఖ్యమని కొవిడ్‌ వర్కింగ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ ఎన్ కే అరోడా పేర్కొన్నారు. ఇక దేశంలో ఉద్ధృతి ఈ నెలలోనే గరిష్ఠానికి చేరుతుందని ఐఐటీ కాన్పుర్‌ నిపుణులు చేసిన అంచనాలు వాస్తవ రూపానికి దగ్గరగా ఉన్నాయన్నారు.

‘దేశంలో ఒమిక్రాన్‌ ఉద్ధృతి కొనసాగుతున్న వేళ.. ప్రతిఒక్కరూ కొవిడ్‌ నిబంధనలు పాటించడం, అర్హులందరికీ వ్యాక్సిన్‌ పంపిణీ చేయడం అనేవి రెండు ముఖ్యమైన అంశాలు. వీటికి తోడు పాలనాపరంగా తీసుకునే కర్ఫ్యూ వంటి చర్యలు కూడా వైరస్‌ వ్యాప్తి కట్టడికి దోహదపడుతాయి’ అని నేషనల్‌ టెక్నికల్‌ ఆడ్వైజరీ గ్రూప్‌ ఆన్‌ ఇమ్యూనైజేషన్‌ (NTAGI)కి చెందిన కొవిడ్‌ వర్కింగ్‌ గ్రూప్‌ ఛైర్మన్ ఎన్‌.కే అరోడా స్పష్టం చేశారు. ఇక వైరస్‌ ప్రవర్తన గురించి మాట్లాడిన ఆయన.. ఒమిక్రాన్‌ వేరియంట్‌లో 3 నుంచి 4 ఉపరకాలు ఉన్నాయని చెప్పారు. వీటిని గుర్తించే విధానం భిన్నమైనప్పటికీ.. వాటి సాంక్రమిక ప్రవర్తన మాత్రం ఒమిక్రాన్‌ మాదిరిగానే ఉందన్నారు.

రానున్న రోజుల్లో కొవిడ్‌ కేసులు పెరుగుతాయని ఐఐటీ కాన్పుర్‌ మోడల్‌ అంచనాలను ఎన్‌.కే అరోడా సమర్థించారు. వాస్తవ పరిస్థితులు అలాగే ఉన్నాయన్న ఆయన.. పలు నగరాల్లో జనవరిలోనే థర్డ్‌వేవ్‌ గరిష్ఠానికి చేరుకునేలా కనిపిస్తోందని అంచనా వేశారు. ముఖ్యంగా దిల్లీ, ముంబయి, కోల్‌కతా నగరాల్లో జనవరి మధ్యలోనే గరిష్ఠానికి చేరుకోవచ్చని ఐఐటీ కాన్పుర్‌ ప్రొఫెసర్‌ మనీంద్ర అగర్వాల్‌ పేర్కొన్న విషయం వాస్తవమన్నారు. అయితే ఏ స్థాయిలో కేసులు పెరుగుతాయో తర్వాత అదే స్థాయిలో తగ్గుముఖం పడతాయని.. మార్చి మూడో వారంలో ఈ మూడో ఉద్ధృతి ముగుస్తుందని మనీంద్ర అగర్వాల్‌ చెప్పిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని