Manish Sisodia: బెయిల్‌ కోసం.. దిల్లీ కోర్టుకు మనీశ్ సిసోదియా

మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన మనీశ్ సిసోదియా  (Manish Sisodia) ప్రస్తుతం సీబీఐ రిమాండ్‌లో ఉన్నారు. ఆయన కస్టడీ రేపటితో ముగియనుంది. ఈ క్రమంలోనే ఈ కేసులో బెయిల్‌ కోరుతూ ఆయన మరోసారి కోర్టును ఆశ్రయించారు.

Published : 03 Mar 2023 17:07 IST

దిల్లీ: మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) నేత మనీశ్ సిసోదియా (Manish Sisodia) దిల్లీ (Delhi) కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తనకు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ రౌస్‌ అవెన్యూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సిసోదియా అభ్యర్థనపై న్యాయస్థానం శనివారం (మార్చి 4) విచారణ చేపట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

ప్రభుత్వ మద్యం విధాన రూపకల్పన, అమలులో అవకతవకలు చోటుచేసుకున్న వ్యవహారంపై జరుపుతున్న దర్యాప్తులో భాగంగా  గత ఆదివారం సీబీఐ (CBI) అధికారులు సిసోదియా (Manish Sisodia)ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సోమవారం కోర్టులో హాజరుపర్చగా.. న్యాయస్థానం ఆయనకు 5 రోజుల కస్టడీ విధించింది. ఆ కస్టడీ కూడా మార్చి 4వ తేదీతోనే ముగియనుండటంతో రేపు ఆయనను సీబీఐ (CBI) అధికారులు కోర్టులో హాజరుపర్చనున్నారు. ఆ సమయంలోనే బెయిల్‌ పిటిషన్‌పై కోర్టు విచారణ జరపనున్నట్లు సమాచారం.

ఈ కేసులో బెయిల్‌ (Bail) కోసం సిసోదియా (Manish Sisodia) ముందు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయడంతో పాటు బెయిల్‌ మంజూరు చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. అక్కడ ఆయనకు చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. పిటిషన్‌దారుకి ట్రయల్‌ కోర్టు, దిల్లీ హైకోర్టుల నుంచి రక్షణ పొందే వీలుండగా నేరుగా సుప్రీంకోర్టు (Supreme Court)కు రావడమేంటని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పిటిషన్‌ను స్వీకరిస్తే అది తప్పుడు సంకేతాలు పంపుతుందని.. ఈ దశలో తాము జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీన్ని దిల్లీ హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించడంతో సిసోదియా (Manish Sisodia) తన బెయిల్‌ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని