Manipur landslide: మణిపుర్‌లో విషాదం.. కొండ చరియలు విరిగిపడి ఏడుగురు మృతి

మణిపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అక్కడ నోనీ జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి.

Updated : 30 Jun 2022 16:33 IST

ఇంఫాల్‌: మణిపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అక్కడ నోనీ జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో రైలుమార్గ నిర్మాణ పనుల్లో ఉన్న అనేకమంది గల్లంతయ్యారు.  ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఏడు మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు తెలిపారు. ఇంకా చాలా మంది శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు భావిస్తున్నారు. జిరిబామ్‌-ఇంఫాల్‌కు మధ్య కొత్త రైల్వే లైన్‌ పనులు జరుగుతున్న తుపుల్‌ యార్డ్‌ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 

‘‘కొండచరియల కింద ఏడు మృతదేహాలను వెలికితీశాం. మొత్తం 45 మంది ఆచూకీ తెలియరాలేదు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించాం. కొండచరియలు విరిగిపడటం వల్ల ఐజెయ్ నది ప్రవాహం ఆగిపోయింది. వరద నీరు రిజర్వాయర్‌లా మారింది. నీటి ప్రవాహానికి కొండచరియలు పక్కకు జరిగిపోతే.. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా మునిగిపోయే ప్రమాదం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. చిన్న పిల్లలను బయటకు రానీయకండి’’ అని నోనె జిల్లా ఎస్డీఓ సోలోమన్ ఫైమేట్ సూచించారు.

కాగా.. మణిపుర్‌ ముఖ్యమంత్రి బీరెన్‌ సింగ్‌ ప్రస్తుత పరిస్థితులను సమీక్షించేందుకు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు రక్షణ దళాలు శ్రమిస్తున్నాయని చెప్పారు. వైద్యులతో సహా అంబులెన్సులు ఘటనా స్థలానికి చేరుకున్నాయని తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని