Moderna: మోడెర్నా టీకాకు కొవిడ్‌ సవాల్‌..! 

మోడెర్నా కొవిడ్‌ టీకా పరిశోధనల్లో భాగంగా మొదట్లో వ్యాక్సిన్‌ వేయించుకొన్న వారికి కొవిడ్‌ సోకుతున్నట్లు  తేలింది. తుదిదశ ప్రయోగ పరీక్షల ఫలితాలను

Published : 16 Sep 2021 14:32 IST

 వ్యాక్సిన్‌ చేయించుకొన్నా సోకుతున్న వైరస్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: మోడెర్నా కొవిడ్‌ టీకా పరిశోధనల్లో భాగంగా మొదట్లో వ్యాక్సిన్‌ వేయించుకొన్న వారికి కొవిడ్‌ సోకుతున్నట్లు తేలింది. తుదిదశ ప్రయోగ పరీక్షల ఫలితాలను విశ్లేషించిన తర్వాత మోడెర్నా ఈ విషయాన్ని వెల్లడించింది. టీకా ప్రభావం వేగంగా తగ్గిపోవడంతో బూస్టర్‌ డోస్‌ తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇటీవల కాలంలో చాలా పరిశోధనలు ఫైజర్‌ టీకా కంటే మోడెర్నా టీకా మరింత కాలం ప్రభావవంతంగా ఉంటుందని అంచనావేశాయి. ఫైజర్‌తో పోలిస్తే మోడెర్నాలో ఎక్కువ మెసెంజర్‌ ఆర్‌ఎన్‌ఏ వినియోగించడమే దీనికి కారణం. కానీ, బుధవారం విడుదలైన డేటా మాత్రం భిన్నంగా ఉంది. 

కాల క్రమంలో మోడెర్నా టీకా ప్రభావం వేగంగా తగ్గుతోంది. దీంతో తొలివిడతలో టీకాలు తీసుకొన్నవారిలో అత్యధిక మందికి కొవిడ్‌ సోకింది. 13 నెలల క్రితం టీకా చేయించుకొన్న వారిని.. 8 నెలల క్రితం టీకా తీసుకొన్నవారి సమాచారం పోల్చి చూసినప్పుడు ఈ విషయం వెల్లడైంది. దీంతో బూస్టర్‌ షాట్‌కు అనుమతి ఇవ్వాలని సెప్టెంబర్‌ 1వ తేదీన మోడెర్నా అమెరికా ఎఫ్‌డీఏకు దరఖాస్తు చేసుకొంది. 

మోడెర్నా 2020 జులై నుంచి అక్టోబర్‌ మధ్య మొత్తం 14,000 మందికి  టీకా ఇచ్చింది. వీరిలో 11,000 మంది ప్లెసిబో(డమ్మీ) గ్రూపులో ఉన్నారు. వీరిలో టీకా తీసుకొన్న వారిలో 162 బ్రేక్‌ త్రూ కొవిడ్‌ కేసులు వచ్చాయి. ప్లెసిబో తీసుకొన్న 11,000 మందికి 2020 డిసెంబర్‌ నుంచి 2021 మార్చి మధ్యలో టీకాను వేశారు. వీరిలో 88 మందికి కొవిడ్‌ సోకినట్లు గుర్తించారు. ఇక తొలుత టీకా తీసుకొన్న వారిలో ముగ్గురు ఆసుపత్రిలో చేరగా.. ఇద్దరు చనిపోయారు. ఇటీవల టీకా తీసుకొన్న వారిలో ఎవరూ ఆసుపత్రిలో చేరలేదు. ఈ నేపథ్యంలో మోడెర్నా బూస్టర్‌ డోస్‌కు దరఖాస్తు చేసుకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని