Mumbai: సర్వర్‌ క్రాష్‌.. విమాన ప్రయాణికుల కష్టాలు

సాంకేతిక సమస్య తలెత్తడంతో ముంబయి విమానాశ్రయంలో ప్రయాణికులు బారులు తీరారు. చెక్‌ఇన్‌ కోసం గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రయాణికులు సమాజిక మాధ్యమాల వేదికగా అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Published : 01 Dec 2022 21:43 IST

ముంబయి: సాంకేతిక సమస్య తలెత్తడంతో ముంబయి విమానాశ్రయంలోని కంప్యూటర్లు మొరాయించాయి. చెక్‌ఇన్‌ కోసం గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతర్జాతీయ విమానాల రాకపోకలు సాగించే టెర్మినల్‌-2లో కంప్యూటర్స్‌ క్రాష్‌ అయినట్లు విమానాశ్రయ సిబ్బంది వెల్లడించారు. దీంతో ప్రయాణికులను విమానాశ్రయం లోపలికి పంపించేందుకు ఆటంకం ఏర్పడింది. వందలాది మంది ప్రయాణికులు బారులు తీరారు.   ఇప్పటికే కొన్ని విమానాలు ఆలస్యంగా బయలుదేరగా.. మరికొన్ని ఇంకా ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో ప్రయాణికులు ట్విటర్‌ వేదికగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. విమానాశ్రయంలో తాజా పరిస్థితిపై ఫొటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారు. దీనిపై ఎయిరిండియా స్పందించింది. ప్రయాణికుల అసౌకర్యానికి చింతిస్తున్నట్లు చెప్పింది. సాంకేతిక నిపుణలు సమస్యను సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారని నిరీక్షణ సమయాన్ని వీలైనంత వరకు తగ్గించే ప్రయత్నం చేస్తామని చెప్పింది. పరిస్థితులు సర్దుకున్న వెంటనే సమాచారమందిస్తామని ప్రయాణికులకు సందేశాలు పంపింది. మరోవైపు నగరంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులవల్ల నెట్‌వర్క్‌ దెబ్బతిందని విమానాశ్రయ సిబ్బంది చెబుతున్నారు. చెక్‌ఇన్‌ కోసం సంబంధిత ఎయిర్‌లైన్స్‌ను సంప్రదించాలని ప్రయాణికులకు సూచించారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని