Hijab Row: కర్ణాటక చీఫ్‌ జస్టిస్‌కు బెదిరింపులు.. నిందితుల అరెస్ట్‌!

తరగతి గదుల్లో హిజాబ్ ధరించేందుకు అనుమతి ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్లను కొట్టివేసిన కర్ణాటక హైకోర్టు ప్రత్యేక ధర్మాసనం న్యాయమూర్తులకు హత్యా బెదిరింపులు వచ్చాయి....

Updated : 20 Mar 2022 16:25 IST

బెంగళూరు: తరగతి గదుల్లో హిజాబ్ ధరించేందుకు అనుమతి ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్లను కొట్టివేసిన కర్ణాటక హైకోర్టు ప్రత్యేక ధర్మాసనం న్యాయమూర్తులకు హత్యా బెదిరింపులు వచ్చాయి. ఈ బెదిరింపులతో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఆ రాష్ట్ర పోలీసులు శనివారం రాత్రి అరెస్టు చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం.. నిందితులిద్దరూ తమిళనాడుకు చెందినవారు. ‘తమిళనాడు తౌహీద్‌ జమాత్‌’ సంస్థలో పనిచేస్తున్నట్లు గుర్తించారు. వీరిపై కర్ణాటక, తమిళనాడులో పలు ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. మరికొంత మందిని కూడా ఈ కేసులో బుక్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు.

గత జనవరిలో ఉడుపి జిల్లా కుందాపురలోని ఓ కళాశాలకు హిజాబ్‌తో వచ్చిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం అడ్డుకుంది. దీన్ని ప్రశ్నిస్తూ, హిజాబ్‌ను అనుమతించాలని ఆరుగురు విద్యార్థినులు కోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ వివాదం రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమవుతుండగా పాఠశాలల అభివృద్ధి సమితి (ఎస్‌డీసీ) రూపొందించిన ఏకరూప వస్త్రాల నిబంధనను తప్పనిసరి చేస్తూ ఫిబ్రవరి 5న రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ వివాదంపై విచారణ జరిపిన కర్ణాటక హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం మంగళవారం తుది తీర్పు వెలువరించింది. హిజాబ్‌.. ముస్లిం మతంలో అనివార్యంగా ఆచరించాల్సిన వస్త్రధారణ కాదని తేల్చి చెప్పింది. విద్యా సంస్థల్లో ఏకరూప వస్త్రాల నిబంధనలను పాటించాలన్న సర్కారు ఆదేశాన్ని సమర్థించింది. ఈ వివాదంపై దాఖలైన పిటిషన్లు హేతుబద్ధంగా లేవంటూ కొట్టేసింది.

ఈ తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ తమిళనాడులో పలు ప్రాంతాల్లో వివిధ సంస్థలు నిరసనలు చేపట్టాయి. అందులో భాగంగా పలువురు.. కర్ణాటక న్యాయమూర్తులపై దాడిని ప్రోత్సహించేలా పలు వ్యాఖ్యలు చేశారు. ప్రధాన న్యాయమూర్తి సహా ఇతర జడ్జీలు ఉదయం నడకకు ఎక్కడికి వెళతారో తమకు తెలుసంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

దీన్ని పరిగణనలోకి తీసుకొని పలువురు న్యాయమూర్తులు, వివిధ పార్టీల నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. భాజపా తమిళనాడు శాఖ అధ్యక్షుడు కె.అన్నామలై.. మద్రాసు హైకోర్టు  ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. మరోవైపు బెంగళూరులోని విధానసౌధ పోలీసు స్టేషన్‌లో ఓ న్యాయవాది ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా కేసు నమోదు చేసి నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని