Rajmarg Yatra: వాహనదారుల కోసం సమస్త సమాచారంతో NHAI కొత్త యాప్‌

జాతీయ రహదారుల గురించి వాహనదారులకు సమస్త సమాచారం అందించేందుకు ఎన్‌హెచ్‌ఏఐ (NHAI) కొత్త యాప్‌ను విడుదల చేసింది. హిందీ, ఆంగ్ల భాషల్లో ఈ యాప్‌ అందుబాటులో ఉంది. 

Updated : 03 Aug 2023 19:38 IST

దిల్లీ: దేశంలోని జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) రాజ్‌మార్గ్‌ యాత్ర (Rajmargyatra) అనే కొత్త యాప్‌ను విడుదల చేసింది. ఈ యాప్‌ ద్వారా వాహనదారులు రహదారుల సమాచారం తెలుసుకోవడంతోపాటు, ఎన్‌హెచ్‌ఏఐలకు సంబంధించిన సమస్యల గురించి ఫిర్యాదు చేయొచ్చు. ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లేస్టోర్‌ నుంచి, ఐఓఎస్‌ యూజర్లు యాపిల్‌ యాప్‌ స్టోర్‌ నుంచి ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హిందీ, ఆంగ్ల భాషల్లో అందుబాటులో ఉంది. 

‘‘జాతీయ రహదారిపై ప్రయాణించే సమయంలో వాహనదారులు ఈ యాప్‌ ద్వారా వాతావరణ వివరాలతోపాటు దగ్గర్లోని టోల్‌ ప్లాజా, పెట్రోల్‌ బంకులు, ఆస్పత్రులు, హోటల్స్‌ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఫొటో, వీడియో జియో-ట్యాగింగ్‌ ద్వారా జాతీయ రహదారులపై ఉన్న సమస్యల గురించి కూడా యాప్‌లో ఫిర్యాదు చేయొచ్చు. ఒకవేళ వాహనదారుడి ఫిర్యాదుకు సంబంధిత అధికారులు స్పందించకపోతే.. యాప్‌లోని సాంకేతికత సదరు ఫిర్యాదును ఆటోమేటిగ్గా ఉన్నతాధికారులకు పంపిస్తుంది. ఈ యాప్‌ ద్వారా ప్రయాణికులు ఫాస్ట్‌టాగ్‌ రీఛార్జ్‌, నెలవారీ పాసులు వంటి సేవలను పొందొచ్చు’’అని కేంద్ర రోడ్డు రవాణా,రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది.

‘ఉల్లి ఘాటు’తో విమానం వెనక్కి..! అసలేం జరిగిందంటే..!

రహదారి ప్రమాదాల నియంత్రణకు ఈ యాప్‌లో ప్రత్యేక ఫీచర్‌ ఉందని ఎన్‌హెచ్‌ఏఐ తెలిపింది. వాహనం పరిమిత వేగాన్ని మించి ప్రయాణిస్తుంటే ఫోన్‌కు నోటిఫికేషన్‌ పంపిస్తుంది. అయితే, ఇందుకోసం వాహనదారుడి ఫోన్‌లో తప్పనిసరిగా యాప్‌ ఉండాలి. అలాగే ఫోన్‌ లొకేషన్‌, మైక్రోఫోన్ వంటి వాటిని ఉపయోగించేందుకు యాప్‌కు అనుమతి ఇవ్వాలి. జాతీయ రహదారులపై బాధ్యతాయుతమైన డ్రైవింగ్‌ ప్రవర్తనను ఇది ప్రోత్సహిస్తుందని ఎన్‌హెచ్‌ఏఐ తెలిపింది. ఇందులో వాయిస్‌ అసిస్టెంట్ ఫీచర్‌ కూడా ఉంది. ఈ యాప్‌ ద్వారా ప్రయాణికులకు రోడ్ నెట్‌వర్క్‌ సమాచారంతోపాటు, యూజర్‌ ఫ్రెండ్లీ అనుభవాన్ని అందించాలని ఆశిస్తున్నట్టు ఎన్‌హెచ్‌ఏఐ తెలిపింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని