Odisha: ఒడిశాలో కొలువుదీరిన నూతన మంత్రివర్గం.. మంత్రులుగా 21 మంది ప్రమాణం

ఒడిశాలో నూతన మంత్రివర్గం కొలువుదీరింది. 21 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు......

Published : 05 Jun 2022 16:48 IST

భువనేశ్వర్‌: ఒడిశాలో నూతన మంత్రివర్గం కొలువుదీరింది. 21 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. 13 మంది కేబినెట్‌ మంత్రులుగా, 8 మంది సహాయ మంత్రులు (ఇండిపెండెంట్‌ ఛార్జి)గా కొలువుదీరారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా సీనియర్లు, యువతకు పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగానే బిజు జనతా దళ్ (BJD) నేతలు జగన్నాథ్ సరక, నిరంజన్ పూజారి, రణేంద్ర ప్రతాప్‌ సహా మరో ముగ్గురికి మంత్రివర్గంలో స్థానం కల్పించారు. భువనేశ్వర్‌లోని లోక్​సేవ భవన్ కన్వెన్షన్ సెంటర్​లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ గణేశీ లాల్.. సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు. కొత్త మంత్రివర్గంలో ఐదుగురు మహిళలకు చోటుదక్కింది.

ఇదిలా ఉంటే.. పదవికి రాజీనామా చేసిన అసెంబ్లీ స్పీకర్ ఎస్ఎన్ పాత్రో మంత్రివర్గంలో చేరడం లేదని తెలుస్తోంది. పాత్రో మంత్రివర్గంలో చేరతారని ఊహాగానాలు వినిపించగా.. వాటిని ఆయన కుమారుడు బిప్లవ్ తోసిపుచ్చారు. అనారోగ్య కారణాలతోనే తన తండ్రి రాజీనామా చేసినట్లు తెలిపారు. ఆయనకు ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స జరుగుతోందని చెప్పారు. శనివారం మంత్రి పదవికి రాజీనామా చేసిన బీకే అరుఖా స్పీకర్ పదవిని చేపట్టనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

2024 ఎన్నికలే లక్ష్యంగా పార్టీని సన్నద్ధం చేసేందుకు సీఎం పట్నాయక్‌ పూనుకున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రివర్గంలోని అందరినీ రాజీనామా చేయాలని శనివారం ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు 20 మంది రాజీనామాలు సమర్పించడంతో కొత్త మంత్రివర్గానికి మార్గం సుగమమైంది. దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక ఎన్నికలతో పాటే ఒడిశాలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటాయి. ప్రస్తుతం ఐదో పర్యాయం అధికారంలో ఉన్న నవీన్‌ పట్నాయక్‌ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను దాటుకుని మరోసారి అధికారంలోకి రావాలని గట్టి పట్టుదలతో ఉంది. అయితే, కొందరు మంత్రుల కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుండడంతో నవీన్‌ పట్నాయక్‌ మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణకు పూనుకున్నారని తెలుస్తోంది. పార్టీకి చేటు చేస్తున్న వ్యక్తులను పక్కన పెట్టి వచ్చే ఎన్నికలే లక్ష్యంగా పార్టీని సన్నద్ధం చేయాలన్నది ఆయన ఆలోచన.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని