Omicron: ఒమిక్రాన్‌ భారీ అలలా ముంచుకొస్తోంది: బోరిస్‌ జాన్సన్‌

ఒమిక్రాన్‌ ‘భారీ అలలా ముంచుకొస్తోంది’ అని జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో బోరిస్‌ జాన్సన్‌ వ్యాఖ్యానించారు....

Published : 13 Dec 2021 12:15 IST

లండన్‌: కరోనాతో గతంలో చిగురుటాకులా వణికిన యునైటెడ్‌ కింగ్‌డమ్‌ ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. ఇప్పటికే వ్యాక్సిన్‌ బూస్టర్‌ డోసును అక్కడి ప్రభుత్వం తప్పనిసరి చేసింది. అయితే, జనవరి 2022 కల్లా 18 ఏళ్లు పైబడిన వారంతా మూడో డోసు తీసుకోవాలని తొలుత లక్ష్యంగా పెట్టుకున్నారు. తాజాగా ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ఈ గడవును ఈ నెలాఖరుకు కుదించారు. ఒమిక్రాన్‌ ‘భారీ అలలా ముంచుకొస్తోంది’ అని జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ఆయన వ్యాఖ్యానించారు.

ఒమిక్రాన్‌ ప్రభావంపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని బోరిస్‌ వ్యాఖ్యానించారు. ఈ వేరియంట్‌ అత్యంత వేగంగా వ్యాపిస్తోందని తెలిపారు. గతంలో చవిచూసిన చేదు అనుభవాల ఆధారంగా ఒమిక్రాన్‌ ఎంత వేగంగా వ్యాపించబోతోందో అంచనా వేయగలమని పేర్కొన్నారు. ప్రతి, రెండు లేదా మూడు రోజులకు కొత్త వేరియంట్‌ కేసులు రెట్టింపవుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఒక్కరోజే యూకేలో 1,239 ఒమిక్రాన్‌ కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,137కి చేరింది. ఒక్కరోజులోనే 65 శాతం కేసులు పెరిగాయి.

ఒమిక్రాన్‌ సామాజిక వ్యాప్తి ఇప్పటికే ప్రారంభమైందని యూకే ఆరోగ్య శాఖకు చెందిన ఉన్నతాధికారులు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం డెల్టా కంటే ఒమిక్రాన్‌ వేగంగా వ్యాపిస్తోందని పేర్కొన్నారు. అలాగే కొత్త వేరియంట్‌పై వ్యాక్సిన్‌ ప్రభావం కూడా తక్కువగానే ఉందని తెలిపారు. దీని మూలంగా ఆసుపత్రిలో చేరుతున్న వారి సంఖ్య సైతం క్రమంగా పెరుగుతోందని వెల్లడించారు. అయితే, వ్యాధి తీవ్రతపై మాత్రం ఇంకా పూర్తి సమాచారం రావాల్సి ఉందన్నారు. బూస్టర్‌ ఒక్కటే దీని కట్టడికి మార్గమని సూచించారు. ఫైజర్‌, మోడెర్నా వ్యాక్సిన్ల మూడో డోసు వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని