Vaccination: 15-18 వయస్సు వారిలో రెండు కోట్ల మందికి మొదటి డోసు

దేశంలో కరోనా టీకా కార్యక్రమంగా వేగంగా సాగుతోంది. శనివారం ఉదయానికి 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్కుల్లో రెండు కోట్ల మందికి పైగా మొదటి డోసు తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ వెల్లడించారు.

Published : 08 Jan 2022 14:25 IST

దిల్లీ: దేశంలో కరోనా టీకా కార్యక్రమం వేగంగా సాగుతోంది. శనివారం ఉదయానికి 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్కుల్లో రెండు కోట్ల మందికి పైగా మొదటి డోసు తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ వెల్లడించారు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విస్తరిస్తోన్న తరుణంలో జనవరి మూడు నుంచి ఈ వయస్సు వారికి టీకా వేస్తున్నారు. ఈ ఐదు రోజుల వ్యవధిలో రెండు కోట్ల మందికి పైగా టీకా మొదటి డోసు అందడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు.  మరోపక్క జనవరి 10 నుంచి ప్రికాషన్‌ డోసులు అందించేందుకు కేంద్రం సన్నద్ధమవుతోంది. ఇందుకోసం శనివారం నుంచి అపాయింట్‌మెంట్లు ప్రారంభిస్తున్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. అంతేగాక, ఈ ముందు జాగ్రత్త డోసుకు అర్హులైన వారు కొత్తగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

ఇక కరోనా టీకా పంపిణీలో భారత్‌ మరో కీలక మైలురాయిని అధిగమించింది. శుక్రవారం నాటికి దేశంలో డోసుల పంపిణీ 150 కోట్లు దాటినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇదొక చరిత్రాత్మక విజయమని మన్‌సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం.. ఇప్పటివరకు దేశంలో వయోజన జనాభాలో 91% మందికి పైగా కనీసం ఒక డోసు వేసుకున్నారు. 66% మంది రెండు డోసులూ తీసుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని