సాగు చట్టాలు: సుప్రీంకు చేరిన కమిటీ ‘నివేదిక’!

నూతన వ్యవసాయ చట్టాలపై నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు సర్వోన్నత న్యాయస్థానం నియమించిన నిపుణుల కమిటీ నివేదికను సుప్రీం కోర్టుకు అందించింది.

Published : 31 Mar 2021 19:37 IST

మార్చి 19నే నివేదించినట్లు సమాచారం

దిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలపై నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు సర్వోన్నత న్యాయస్థానం నియమించిన నిపుణుల కమిటీ నివేదికను సుప్రీంకోర్టుకు అందించింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం, సాగుచట్టాలపై వివిధ వర్గాల అభిప్రాయాలు, సూచనలు, మార్గదర్శకాలతో కూడిన నివేదికను మార్చి 19వ తేదీనే ముగ్గురు సభ్యుల కమిటీ సుప్రీంకోర్టుకు నివేదించింది.

సాగు చట్టాలపై దేశవ్యాప్తంగా రైతులు, వివిధ వర్గాలతో సంప్రదింపులు జరిపేందుకు భారత అత్యున్నత న్యాయస్థానం జనవరి నెలలో నలుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. వీరిలో ఒకరైన భూపీందర్‌ సింగ్‌ మాన్‌ కమిటీ నుంచి మొదట్లోనే తప్పుకున్నారు. ఈ కమిటీలో సభ్యుడిగా నామినేట్‌ చేసినందుకు సర్వోన్నత న్యాయస్థానికి కృతజ్ఞతలు తెలిపిన మాన్‌.. రైతుల ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని చెప్పారు. మహారాష్ట్రకు చెందిన షెట్కరీ సంఘటనా అధ్యక్షుడు అనిల్‌ ఘన్వాత్‌తో పాటు వ్యవసాయరంగ ఆర్థికవేత్త అశోక్‌ గులాటీ, డాక్టర్‌ ప్రమోద్‌ కుమార్‌ జోషీలు దేశవ్యాప్తంగా రైతులు, వివిధ రంగాల నిపుణులతో పలు దఫాల్లో సంప్రదింపులు జరిపారు. ఇందుకోసం నేరుగా, ఆన్‌లైన్‌ సహాయంతో వివిధ వర్గాలతో భేటీ అయ్యారు. అనంతరం వీటిపై రూపొందించిన నివేదికను ఈమధ్యే సుప్రీం కోర్టుకు నివేదించినట్లు సమాచారం.

ఇక వివాదాస్పదంగా మారిన మూడు వ్యవసాయ చట్టాల అమలుపై సుప్రీంకోర్టు జనవరి 11న స్టే విధించిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో సంప్రదింపుల కోసం కమిటీ నియమించింది. మరోవైపు, ఈ చట్టాలను పూర్తిగా రద్దుచేయాలని, అప్పటిదాకా తమ ఉద్యమాన్ని విరమించేది లేదని రైతు సంఘాల ప్రతినిధులు తెగేసి చెబుతున్నారు. దీనిపై దేశ రాజధాని దిల్లీ సరిహద్దులతో పాటు వివిధ రాష్ట్రాల్లోనూ రైతు సంఘాల నాయకులు తమ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని