Rahul Gandhi: రాహుల్‌ క్షమాపణలు చెప్పాల్సిందే.. దద్దరిల్లిన పార్లమెంట్‌

భారత ప్రజాస్వామ్యాన్ని అవమానించిన రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సిందేనని పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వం డిమాండ్‌ చేసింది. దీంతో ఉభయ సభలు దద్దరిల్లాయి.

Updated : 13 Mar 2023 15:04 IST

దిల్లీ: విదేశీ గడ్డ మీద భారత ప్రజాస్వామ్యంపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలు దేశంలో రాజకీయంగా ప్రకంపనలు సృష్టించాయి. తాజాగా పార్లమెంట్‌ (Parliament) బడ్జెట్‌ సమావేశాల్లోనూ (Budget Session) ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి. రాహుల్‌ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డ కేంద్ర ప్రభుత్వం.. ఆయన క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్‌ చేసింది. దీంతో పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి. గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి.

పార్లమెంట్‌ మలి విడత బడ్జెట్‌ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ ఉదయం 11 గంటలకు లోక్‌సభ (Lok sabha)మొదలవ్వగానే కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ (Rajnath Singh)ఈ అంశాన్ని  ప్రస్తావించారు. ‘‘లండన్‌ గడ్డపై రాహుల్‌ గాంధీ భారత్‌ను అవమానించారు. మన దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలని విదేశాలను కోరారు. ఆయన వ్యాఖ్యలను ఈ సభలోని సభ్యులంతా ఖండించాలి. రాహుల్‌ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి’’ అని రాజ్‌నాథ్‌ డిమాండ్‌ చేశారు. ఆయన వ్యాఖ్యలకు భాజపా మిత్రపక్ష నేతలు కూడా మద్దతు పలికారు. అయితే రాజ్‌నాథ్ విమర్శలను కాంగ్రెస్‌ (Congress) సభ్యులు వ్యతిరేకించారు. ప్రధాని మోదీ కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విదేశాల్లో విమర్శలు గుప్పించారని గుర్తుచేస్తూ ఆందోళన చేపట్టారు. దీంతో ఒకింత ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో స్పీకర్‌ ఓం బిర్లా తొలుత సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. ఆ తర్వాత సభ తిరిగి ప్రారంభమైనా ప్రతిపక్షాల ఆందోళనలు కొనసాగడంతో సభ మంగళవారానికి వాయిదా పడింది.

రాహుల్‌ వ్యాఖ్యలు సిగ్గు చేటు..

అటు రాజ్యసభ (Rajya Sabha)లోనూ ఇదే విషయంపై గందరగోళం చోటుచేసుకుంది. పెద్దల సభ ప్రారంభం కాగానే కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ (Piyush Goyal).. రాహుల్‌ వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావించారు. ‘‘ఓ సీనియర్‌ రాజకీయ నాయకుడు విదేశీ గడ్డపై భారత ప్రజాస్వామ్యాన్ని అవమానించడం సిగ్గుచేటు. ఎమర్జెన్సీ విధించిన సమయంలో.. ఓ కాంగ్రెస్‌ నేత చట్టాల ప్రతులను చించేసినప్పుడు మన ప్రజాస్వామ్యం (Indian Democracy) ప్రమాదంలో ఉంది. ఇప్పుడు కాదు’’ అని గోయల్‌ మండిపడ్డారు. తన వ్యాఖ్యలకు గానూ ఆ నేత(రాహుల్‌ను ఉద్దేశిస్తూ) క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

అయితే గోయల్‌ వ్యాఖ్యలను కాంగ్రెస్‌ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే తీవ్రంగా ఖండించారు. ఎగువ సభలో సభ్యుడు కాని ఓ వ్యక్తిని సభకు పిలిచి క్షమాపణ చెప్పాలని అడగడం ఆమోదనీయం కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఖర్గే వ్యాఖ్యలను ట్రెజరీ బెంచ్‌ సభ్యులు మధ్యలోనే అడ్డుకున్నారు. ఈ పరిణామాలతో రాజ్యసభ కూడా రేపటికి వాయిదా పడింది.

ఇటీవల రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) లండన్‌లోని కేంబ్రిడ్జి యూనివర్శిటీలో విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తూ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీ హయాంలో భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతోందని ఆయన దుయ్యబట్టారు. అయితే ఈ వ్యాఖ్యలను భాజపా నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని