fuel price: దీపావళి వేళ పెట్రోల్‌, డీజిల్ ధరలు తగ్గించిన కేంద్రం!

దేశంలో రోజురోజుకీ ఇంధన ధరలు పెరుగుదలతో అల్లాడిపోతున్న ప్రజలకు దీపావళి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కొంత ఉపశమనం కలిగించే నిర్ణయం తీసుకుంది......

Updated : 04 Nov 2021 11:00 IST

దిల్లీ: దేశంలో రోజురోజుకీ ఇంధన ధరల పెరుగుదలతో అల్లాడిపోతున్న ప్రజలకు దీపావళి పండుగ వేళ కేంద్ర ప్రభుత్వం కొంత ఉపశమనం కలిగించే నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌, డీజిల్‌లపై ఎక్సైజ్‌ సుంకం తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. లీటరు పెట్రోల్‌పై రూ.5, లీటరు డీజిల్‌పై రూ.10 చొప్పున తగ్గిస్తున్నట్టు వెల్లడించింది. పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకం తగ్గింపు గురువారం నుంచి అమలులోకి రానుంది.

కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గనున్నాయి. కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ సమయంలో కూడా రైతులు తమ కష్టార్జితంతో ఆర్థిక వృద్ధికి తోడ్పాటు అందించారనీ, డీజిల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీని తగ్గించడం వల్ల రాబోయే రబీ సీజన్‌లో వారికి ప్రోత్సాహకరంగా ఉంటుందని కేంద్రం ఓ ప్రకటనలో పేర్కొంది. రాష్ట్రాలు కూడా వ్యాట్‌ను తగ్గిస్తే వినియోగదారులకు మరింతగా ఊరటగా ఉంటుందని కేంద్రం కోరినట్టు సమాచారం.

గతంలో ఎన్నడూ లేనంత భారీగా పెంచేసిన ఇంధన ధరలు సామాన్యుడికి గుదిబండలా మారాయి. బుధవారం దేశ రాజదాని దిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర ₹110.4 ఉండగా.. డీజిల్ ధర ₹98.42గా ఉంది. ఇకపోతే, ముంబయి మహానగరంలో లీటరు పెట్రోల్‌ ధర ₹115.85, డీజిల్‌ ధర ₹106.62గా ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని