‘ఆ రెస్టారెంట్‌ మన పరిధిలోనిదేగా.. బిర్యానీకి డబ్బులెందుకు?’

డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఫ్రీగా బిర్యానీ తీసుకురా’ అంటూ ఓ పోలీసు అధికారిణి తన తోటి పోలీసుతో అన్న మాటలు ఇప్పుడు మహారాష్ట్రలో వైరల్‌గా మారాయి. పోలీసులు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో ఆ అధికారిణిపై విచారణ జరపాలని

Published : 31 Jul 2021 01:06 IST

పుణె: ‘డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఫ్రీగా బిర్యానీ తీసుకురా’ అంటూ ఓ పోలీసు అధికారిణి తన తోటి పోలీసుతో అన్న మాటలు ఇప్పుడు మహారాష్ట్రలో వైరల్‌గా మారాయి. పోలీసులు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో ఆ అధికారిణిపై విచారణ జరపాలని ఏకంగా రాష్ట్ర హోంమంత్రే ఆదేశించారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

పుణె సిటీ పోలీసు విభాగంలో డీసీపీగా పనిచేస్తున్న ఓ పోలీసు అధికారిణికి బిర్యానీ తినాలనిపించింది. దీంతో తోటి పోలీసుతో మంచి మాంసాహారం ఎక్కడ లభిస్తుందని అడిగారు. సదాశివ్‌పేట ప్రాంతంలో నెయ్యితో చేసిన చికెన్‌ బిర్యానీ, కోల్హాపురి మటన్‌ విక్రయించే రెస్టారెంట్‌ ఉందని పోలీసు సమాధానమిచ్చారు. దీంతో ఆమె అక్కడి నుంచే బిర్యానీ తీసుకురావాలని చెప్పగా.. డబ్బుల ప్రస్తావన వచ్చింది. ఆ రెస్టారెంట్‌ మన అధికార పరిధిలోకే వస్తుంది కదా? డబ్బులు ఎందుకు ఇవ్వడం ఫ్రీగానే తీసుకురా అని చెప్పారు. వీరి సంభాషణ మొత్తం ఆడియో క్లిప్‌ రూపంలో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. తామంతా డబ్బులిచ్చే బిర్యానీ తెచ్చుకుంటామని పోలీసులు చెప్పినా.. డీసీపీ మాత్రం ఫ్రీగా తేవాలని చెప్పడం ఆడియోక్లిప్‌లో స్పష్టంగా వినిపించింది. దీంతో డీసీపీ అధికార దుర్వినియోగం చేస్తున్నారని, అన్ని ఉచితంగా పొందాలని చూస్తున్నారంటూ నెటిజన్లు విమర్శల వర్షం కురిపించారు. 

కాగా.. పుణె పర్యటనకు వచ్చిన రాష్ట్ర హోంమంత్రి దిలిప్‌ వాల్సే పాటిల్‌ ఈ ఘటనపై మీడియాతో మాట్లాడారు. తాను కూడా ఆ ఆడియో క్లిప్‌ను విన్నట్లు తెలిపారు. ఇది చాలా తీవ్రమైన అంశమని, దీనిపై విచారణ జరపాలని పోలీసు కమిషనర్‌కు ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు. కమిషనర్‌ నివేదిక ఇచ్చిన తర్వాత ఆ పోలీసు అధికారిణిపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని