Rahul Gandhi: రాహుల్‌కు కొత్త పాస్‌పోర్టు జారీ.. అమెరికా పర్యటనకు సిద్ధం

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)కి కొత్తగా సాధారణ పాస్‌పోర్టు జారీ అయ్యింది. దీంతో రాహుల్‌ గాంధీ అమెరికా పర్యటనకు సిద్ధమయ్యారు.

Published : 28 May 2023 18:25 IST

దిల్లీ: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)కి కొత్తగా సాధారణ పాస్‌పోర్టు జారీ అయ్యింది. స్థానిక కోర్టు నిరభ్యంతర పత్రం జారీచేసిన రెండు రోజుల్లోనే రాహుల్‌కు ఈ కొత్త పాస్‌పోర్టు (Passport) వచ్చింది. దీంతో ఆయన సోమవారం నాడు అమెరికా పర్యటనకు బయలుదేరనున్నారు. ఇటీవల లోక్‌సభ సభ్యత్వంపై వేటు పడటంతో ఆయన దౌత్య పాస్‌పోర్టును కోల్పోయిన విషయం తెలిసిందే.

ఈ నెల 31 నుంచి వారం రోజులపాటు రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) అమెరికాలో పర్యటించనున్నారు. స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీ విద్యార్థులతోపాటు భారత సంతతి పౌరులతోనూ సమావేశమవుతారు. ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లోనూ మాట్లాడే అవకాశం ఉంది. వాషింగ్టన్‌ డీసీలో చట్టసభ సభ్యులు, మేధావులతో భేటీ అవుతారు. జూన్‌ 4న న్యూయార్క్‌లో ఏర్పాటు చేసే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. నగరంలోని జావిట్స్‌ సెంటర్‌లో పలురంగాల వారితో ఈ ముఖాముఖి నిర్వహిస్తారు. అయితే, ప్రధాని మోదీ (Narendra Modi) అమెరికా పర్యటనకు వెళ్లనున్న కొద్ది రోజుల ముందే.. రాహుల్‌ గాంధీ అక్కడ పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. జూన్‌ 22నుంచి నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించనున్నారు.

మరోవైపు, మోదీ ఇంటి పేరుపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న అభియోగాలపై రాహుల్‌ గాంధీకి ఇటీవల రెండేళ్ల జైలు శిక్ష పడింది. దీంతో ఆయన లోక్‌సభ సభ్యత్వం కోల్పోయారు. ఫలితంగా తన దౌత్య హోదా పాస్‌పోర్టును అధికారులకు అప్పగించారు. ఈ నేపథ్యంలోనే ఆయన కొత్తగా సాధారణ పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై నేషనల్‌ హెరాల్డ్‌ కేసు పిటిషన్‌దారు సుబ్రమణ్యస్వామి అభ్యంతరం తెలపడంతో.. రాహుల్‌ గాంధీ నిరభ్యంతర పత్రం కోసం కోర్టును ఆశ్రయించారు. ఇందుకు అంగీకరించిన న్యాయస్థానం.. పదేళ్లు కాకుండా మూడేళ్ల వ్యవధితో కూడిన పాస్‌పోర్టు జారీకి అంగీకరించింది. ఈ క్రమంలోనే పాస్‌పోర్టు అధికారులు ఆదివారం మధ్యాహ్నం కొత్త పాస్‌పోర్టు జారీచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని