Indian Railway: ఆ రైల్వే స్టేషన్లలో ‘అభివృద్ధి’ బాదుడు.. రైల్వేశాఖ సన్నద్ధం!

రైల్వే శాఖ కొత్త బాదుడుకు సన్నద్ధమవుతోంది. పునరాభివృద్ధి చేసిన రైల్వేస్టేషన్లలో రైలు ఎక్కినా, దిగినా ఇకపై వాత తప్పదు. ప్రయాణించే తరగతిని బట్టి స్టేషన్‌ డెవలప్‌మెంట్‌ ఫీజు (ఎస్‌డీఎఫ్‌)ను ప్రయాణికుల నుంచి వసూలు చేయనున్నారు.

Published : 08 Jan 2022 21:39 IST

దిల్లీ: రైల్వే శాఖ కొత్త బాదుడుకు సన్నద్ధమవుతోంది. పునరాభివృద్ధి చేసిన రైల్వేస్టేషన్లలో రైలు ఎక్కినా, దిగినా ఇకపై వాత తప్పదు. ప్రయాణించే తరగతిని బట్టి స్టేషన్‌ డెవలప్‌మెంట్‌ ఫీజు (ఎస్‌డీఎఫ్‌)ను ప్రయాణికుల నుంచి వసూలు చేయనున్నారు. ఒకసారి పునరాభివృద్ధి చేసిన స్టేషన్లు అందుబాటులోకి వచ్చాక.. బుకింగ్‌ సమయంలోనే ఈ మొత్తాన్ని టికెట్‌తోపాటు వసూలు చేయనున్నారు. రూ.10 నుంచి రూ.50 మేర ఈ మొత్తం ఉంటుంది.

స్టేషన్‌ డెవలప్‌మెంట్‌ ఫీజు కింద మొత్తం మూడు కేటగిరీల్లో ఈ ఫీజును వసూలు చేయనున్నారు. ఏసీకైతే రూ.50, స్లీపర్‌ క్లాస్‌కైతే రూ.25, అన్‌ రిజర్వ్‌డ్‌ క్లాస్‌కైతే రూ.10 చొప్పున ప్రయాణికులు చెల్లించాల్సి ఉంటుంది. సబర్బన్‌ రైళ్లకు దీన్నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు రైల్వే బోర్డు ఓ సర్క్యులర్‌లో పేర్కొంది. ఆయా రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫాం టికెట్‌ ధర కూడా రూ.10 మేర పెరగనుంది.

‘‘అభివృద్ధి చేసిన/ పునరాభివృద్ధి చేసిన స్టేషన్లలో ‘స్టేషన్‌ డెవలప్‌మెంట్‌ ఫీజు’ను తరగతిని బట్టి వసూలు చేయాలి. ఒకవేళ ఆ స్టేషన్‌లో ప్రయాణికుడు దిగినట్లయితే నిర్దేశించిన ఫీజు మొత్తంలో 50 శాతం భారం పడుతుంది. ఒకవేళ రైలు ఎక్కే స్టేషన్‌, దిగే స్టేషన్‌ రెండూ కూడా అభివృద్ధి చేసిన రైల్వే స్టేషన్లయితే నిర్దేశించిన దానికంటే 1.5 రెట్లు భారం అధికంగా ఉంటుంది’’ అని రైల్వే బోర్డు ఆ సర్క్యులర్‌లో పేర్కొంది. స్టేషన్‌ డెవలప్‌మెంట్‌ ఫీజు వల్ల రైల్వే ఆదాయం పెరగడంతో పాటు, ప్రైవేటు వ్యక్తులను ఆకర్షించడానికి ఉపయోగపడుతుందని సీనియర్‌ అధికారులు పేర్కొన్నారు. ప్రయాణికులకు అత్యాధునిక సదుపాయాలను కల్పించే లక్ష్యంగా దేశంలోని పలు రైల్వే స్టేషన్లను రైల్వే శాఖ అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే పశ్చిమ మధ్య రైల్వే పరిధిలోని రాణి కమలాపాటి స్టేషన్‌, పశ్చిమ రైల్వే పరిధిలోని గాంధీనగర్‌ కేపిటల్‌ స్టేషన్‌ అభివృద్ధి పూర్తవ్వడంతో పాటు అందుబాటులోకి కూడా వచ్చాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని