Rajnath singh: దుష్ట ప్రయత్నాలు చేస్తే తగిన బుద్ధి చెబుతాం: రాజ్‌నాథ్‌ సింగ్‌ హెచ్చరిక

తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్‌లో చైనా సైనికులతో జరిగిన ఘర్షణల సమయంలో భారత సైనికులు చూపిన అసమాన ధైర్యసాహసాలు, తెగువను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌(Rajnath Singh) మరోసారి ప్రశంసించారు. ‘......

Published : 06 Oct 2022 01:49 IST

దిల్లీ: తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్‌లో చైనా సైనికులతో జరిగిన ఘర్షణల సమయంలో భారత సైనికులు చూపిన అసమాన ధైర్యసాహసాలు, తెగువను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌(Rajnath Singh) మరోసారి ప్రశంసించారు. ‘ప్రపంచమంతా ఒకటే కుటుంబం’ అనే సూత్రాన్ని భారత్‌ విశ్వసిస్తుందని.. అయితే, బయటి వ్యక్తులెవరైనా దుష్ట ప్రయత్నాలు చేస్తే తగిన విధంగా ప్రతిస్పందిస్తుందన్నారు. బుధవారం ఆయన ఉత్తరాఖండ్‌లోని ఔలిలో మిలటరీ బేస్‌లో విజయదశమి వేడుకల్లో పాల్గొన్నారు. సైనికులతో కలిసి దసరా వేడుకలు చేసుకున్న ఆయన ఆయుధ పూజ నిర్వహించిన అనంతరం మాట్లాడారు. ఇలాంటి ధైర్యసాహసాల కారణంగా పెరుగుతోన్న భారత్‌ స్థాయిని యావత్‌ ప్రపంచం గుర్తించిందన్నారు. అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన అనేక సమస్యలపై కీలక నిర్ణయాలు తీసుకొనే దేశాల్లో ఒకటిగా మన దేశం అవతరించిందని తెలిపారు.

యూనిఫాంలో ఉన్న పురుషులు, మహిళలతో మాట్లాడం ఎప్పుడూ ప్రేరణనిస్తుందన్న రాజ్‌నాథ్‌ సింగ్‌.. తమ సైనికుల సామర్థ్యం పట్ల విశ్వాసంతో యావత్‌ దేశమే గర్వపడుతోందన్నారు. బాహ్య ముప్పు నుంచి దేశాన్ని రక్షించడంలో సాయుధ దళాల పాత్రను ఆయన కొనియాడారు. దేశంలో సురక్షిత వాతావరణమే ప్రధాని మోదీ సారథ్యంలో దేశం ఆర్థికాభివృద్ధిని కొనసాగించడానికి, అభివృద్ధిలో కొత్త శిఖరాలకు చేరుకొనేందుకు దోహదం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ పాండే, జనరల్‌ ఆఫీసర్‌ కమాండ్‌ ఇన్‌ చీఫ్‌ సూర్య, కమాండ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ యోగేంద్ర దిమ్రీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సైనికులు దేశభక్తి గీతాలు ఆలపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని