‘జంగిల్‌ రాజ్‌ నడిచింది గుజరాత్‌లోనే’.. అమిత్‌షా వ్యాఖ్యలకు లాలూ కౌంటర్‌

బిహార్‌లో అధికారం పోయిందన్న బాధలో హోంమంత్రి అమిత్‌షా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ అన్నారు.

Published : 24 Sep 2022 19:12 IST

దిల్లీ: బిహార్‌లో అధికారం పోయిందన్న బాధలో హోంమంత్రి అమిత్‌షా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ అన్నారు. 2024 ఎన్నికల్లోనూ అదే జరగబోతోందని చెప్పారు. అందుకే జంగిల్‌ రాజ్‌ అదీ ఇదీ మాట్లాడుతున్నారని లాలూ అన్నారు. అమిత్‌షా గుజరాత్‌లో ఉన్నప్పుడే జంగిల్‌ రాజ్‌ నడిచిందంటూ దుయ్యబట్టారు. బిహార్‌లో నిర్వహించిన ఓ సభలో జేడీయూ-ఆర్జేడీ ప్రభుత్వంపై అమిత్‌షా విమర్శలు గుప్పించిన నేపథ్యంలో లాలూ ఈ విధంగా స్పందించారు.

నీతీశ్‌కుమార్‌తో కలిసి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీతో ఆదివారం భేటీ కానున్నారు. ఇందులో భాగంగా దిల్లీ చేరుకున్న లాలూ విలేకరులతో మాట్లాడారు. ప్రతిపక్షాల ఐక్యత కోసం తాము కృషి చేస్తున్నామని చెప్పారు. రేపటి సమావేశంలో ఈ అంశం ఎజెండాలో ఉందని పేర్కొన్నారు. 2024లోనూ కేంద్రంలో తామే అధికారంలోకి వస్తామని భాజపా ధీమాగా ఉందని విలేకరులు ప్రస్తావించగా.. అదెలాగో తామూ చూస్తామని చెప్పారు.

అంతకుముందు శుక్రవారం బిహార్‌లో జరిగిన ఓ సభలో అమిత్‌ షా మాట్లాడుతూ.. ప్రధాని కావాలనే ఆకాంక్షతోనే బిహార్‌ సీఎం నీతీశ్‌ కుమార్‌ ఆర్‌జేడీ, కాంగ్రెస్‌లతో చేతులు కలిపి భాజపాకు వెన్నుపోటు పొడిచారని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు. నీతీశ్‌కు సిద్ధాంతాలు లేవన్న ఆయన.. కుల రాజకీయాలు చేస్తూ సోషలిజాన్ని విడిచిపెట్టారని విమర్శించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌ మహాకూటమిని అక్కడి ప్రజలే తరిమికొడతారని.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సొంత మెజారిటీతో భాజపా అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని