‘స్కాం’పై దర్యాప్తు చేస్తున్నవారే ‘స్కాం’కు పాల్పడితే..! EDపై మండిపడ్డ AAP

రూ.5కోట్ల లంచం ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌పై సీబీఐ (CNI) కేసు నమోదు చేయడం సంచలనం రేపింది.

Published : 29 Aug 2023 16:53 IST

దిల్లీ: కుంభకోణాలపై దర్యాప్తు జరిపే జాతీయ దర్యాప్తు సంస్థ (ED) కీలక అధికారిపైనే అవినీతి ఆరోపణలు రావడం చర్చనీయాంశమయ్యింది. రూ.5కోట్ల లంచం ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌పై సీబీఐ (CBI) కేసు నమోదు చేయడం సంచలనం రేపింది. ఈ వ్యవహారంపై తీవ్రంగా మండిపడ్డ ఆప్‌ఆద్మీపార్టీ (AAP).. కుంభకోణాలపై దర్యాప్తు చేసే సంస్థే ‘స్కాం’కు పాల్పడటం దారుణమని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈడీని తక్షణమే మూసివేయాలని సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి చేసింది.

‘మద్యం కుంభకోణం పేరుతో గత ఏడాదిగా ఈడీ దర్యాప్తు జరుపుతోంది. స్కాం విలువపై ఇప్పటికీ భిన్న ప్రకటనలు చేస్తూనే ఉంది. ఓసారి రూ.100కోట్లు అని, మరోసారి రూ.వెయ్యి కోట్లు అని చెబుతోంది. డబ్బును గుర్తించడం మాత్రం విఫలమయ్యింది’ అని ఆమ్‌ఆద్మీపార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్‌ సింగ్‌ ఆరోపించారు. స్కాంను దర్యాప్తు చేస్తున్న సంస్థే స్కాంకు పాల్పడటం దారుణమన్న ఆయన.. విచారణ పేరుతో ఈడీ దోపిడీకి పాల్పడుతోందన్నారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సంస్థను వెంటనే మూసివేయాలని సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

అమన్‌దీప్‌ ధాల్‌ అనే వ్యాపారవేత్త దిల్లీ మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసు నుంచి బయటపడేలా చేసేందుకు గాను ఈయన నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌పై పవన్‌ ఖత్రీ.. రూ.5కోట్ల లంచం తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో పవన్‌ ఖత్రీపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన సీబీఐ.. ఆరుచోట్ల సోదాలు నిర్వహించింది. కీలక దస్త్రాలు స్వాధీనం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఈడీ తీరుపై ఆప్‌ తీవ్రంగా మండిపడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు