ED Raids: ఆదిత్య ఠాక్రే సన్నిహితుడి ఇంట్లో ఈడీ సోదాలు.. మండిపడ్డ శివసేన

మహారాష్ట్రలోని 12 చోట్ల ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఈరోజు ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. అయితే ఈ 12 మందిలో ముగ్గురు శివసేనకు చెందిన నేతలే ఉండటం గమనార్హం......

Published : 08 Mar 2022 23:25 IST

ముంబయి: మహారాష్ట్రలోని 12 చోట్ల ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఈరోజు ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. అయితే ఈ 12 మందిలో ముగ్గురు శివసేనకు చెందిన నేతలే ఉండటం గమనార్హం. మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రేకు అత్యంత సన్నిహితుడు, శివసేన నేత రాహుల్‌ కనాల్‌ ఇంట్లోనూ ఈడీ సోదాలు చేపట్టింది. ఆయన శిర్డీ ట్రస్ట్‌ మెంబర్‌ కూడా. కాగా ఈ దాడులపై శివసేన మండిపడింది. కేంద్రం ఉద్దేశపూర్వకంగానే భాజపేతర రాష్ట్రాలైన బెంగాల్‌, మహారాష్ట్రను లక్ష్యంగా చేసుకొని ఈ తరహా దాడులు చేయిస్తోందని మండిపడింది.

ఈడీ సోదాల అనంతరం ఆదిత్య ఠాక్రే స్పందిస్తూ.. దర్యాప్తు సంస్థలు భాజపాకు ప్రచార యంత్రాల్లా మారాయని ఆరోపించారు. ఈ తరహా దాడులు మహారాష్ట్రపై గతంలోనూ జరిగాయని, ఇప్పుడు కూడా జరుగుతున్నాయని తెలిపారు. ‘కేంద్ర దర్యాప్తు సంస్థలను గతంలోనూ ఇలా దుర్వినియోగం చేశారు. ఎన్నికలకు ముందు బెంగాల్‌, ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇలా దాడులు జరిగాయి. ఈ సంస్థలు ఒక రకంగా భాజపాకు ప్రచార యంత్రాల్లా మారాయి. కానీ మేము తలవంచబోం’ అని పేర్కొన్నారు.

శివసేన సీనియర్‌ నేత సంజయ్‌ రౌత్‌ భాజపా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ని కేంద్ర ఏజెంట్‌గా పోలుస్తూ.. ఈ విభాగం దోపిడీకి పాల్పడుతోందని ఆరోపించారు. ‘మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌లోని ప్రజలను మాత్రమే ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారు? శివసేన, తృణమూల్ కాంగ్రెస్‌పైనే దాడి చేస్తున్నారు. ఈ రాష్ట్రాలపై ఒత్తిడి పెంచి ప్రభుత్వాలను పడగొట్టేందుకే కేంద్రం ఇలా చేస్తోంది’ అని రౌత్‌ ఆరోపించారు. కానీ దేశంలోని ఏ ఒక్క భాజపా నేత ఇంట్లో సోదాలు చేయడంలేదన్నారు. 50 మంది భాజపా నేతల అక్రమాలపై తాము ఆదాయపు పన్ను శాఖ, ఈడీకి సమాచారం ఇచ్చామని.. కానీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని