జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్‌ వర్కర్లుగా ప్రకటించండి 

పాత్రికేయులను ఫ్రంట్‌లైన్‌ వర్కర్లుగా ప్రకటించాలని ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.  కరోనా వైరస్‌ రోజురోజుకీ.....

Published : 15 Apr 2021 23:15 IST

కేంద్రాన్ని కోరిన ఎడిటర్స్‌ గిల్డ్‌

దిల్లీ: పాత్రికేయులను ఫ్రంట్‌లైన్‌ వర్కర్లుగా ప్రకటించాలని ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.  కరోనా వైరస్‌ రోజురోజుకీ ఉద్ధృతరూపం దాల్చుతున్న వేళ సత్వరమే టీకా అందించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో ఇతర ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌కు ఇచ్చిన విధంగా జర్నలిస్టులకు కూడా ప్రాధాన్యమివ్వాలని కోరింది. కరోనా మహమ్మారి, ఎన్నికలు, ఇతర వర్తమాన అంశాలను నిర్విరామంగా కవర్‌ చేస్తూ వార్తా సంస్థలు పాఠకులకు నిరంతరం వార్తలు, సమాచారాన్ని అందించే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. న్యూస్‌ మీడియాని ఇప్పటికే అత్యవసర సేవల జాబితాలో చేర్చారని, కరోనా ఉద్ధృతమవుతున్న ఈ తరుణంలో పాత్రికేయ సిబ్బందికి వ్యాక్సిన్‌ ఇచ్చి రక్షణ కల్పించడం అవసరమని తెలిపింది. టీకా రక్షణ కూడా లేకపోతే మీడియా సిబ్బంది తమ వృత్తి బాధ్యతలు నిర్వర్తించడం కష్టంగా ఉంటుందని పేర్కొంది. వయసుతో నిమిత్తం లేకుండా వార్తాసంస్థల్లో పనిచేస్తున్న సిబ్బంది అందరికీ టీకా వేయాలని కేంద్రాన్ని  అభ్యర్థించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని