Singapore Embassy: అది మా కారు కాదు.. అప్రమత్తంగా ఉండండి: సింగపూర్‌ ఎంబసీ ట్వీట్

దౌత్య కార్యాలయ సిబ్బందికి కేటాయించిన సీడీ నంబరు ప్లేటును దుర్వినియోగం చేయడంపై భారత్‌లోని సింగపూర్ రాయబార కార్యాలయం ఆందోళన వ్యక్తం చేసింది.

Published : 24 Nov 2023 18:20 IST

దిల్లీ: నకిలీ నంబర్‌ ప్లేట్‌లను ఉపయోగించి నేరస్థులు దొంగతనాలు, హత్యతోపాటు ఇతరత్రా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుంటారు. పోలీసుల తనిఖీల్లో పట్టుపడితే మినహా.. అప్పటి దాకా దర్జాగా నకిలీ నంబర్‌ ప్లేట్‌లు ఉన్న వాహనాలపై తిరుగుతుంటారు. తాజాగా దిల్లీలో ఓ వ్యక్తి ఏకంగా విదేశీ రాయబార కార్యాలయం నంబర్‌ ప్లేట్‌ను తన వాహనానికి అమర్చాడు. దీనిపై భారత్‌లోని సింగపూర్‌ రాయబార కార్యాలయం ఆందోళన వ్యక్తం చేసింది. కారుతో ఎంబసీకి ఎలాంటి సంబంధం లేదని, అది నకిలీదని ఒక ప్రకటనలో తెలిపింది. కారు ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేస్తూ.. అప్రమత్తంగా ఉండాలని సూచించింది. 

‘‘63 CD నంబరు ప్లేటుతో ఉన్న కారు ఎంబసీది కాదు. అది నకిలీ నంబరు. దీనిపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖతోపాటు పోలీసులకు సమాచారం అందించాం. ఈ కారు నగరంలో లేదా ఎయిర్‌పోర్టులో ఎక్కడైనా పార్క్‌ చేసి ఉండటం చూస్తే.. అప్రమత్తంగా ఉండండి’’ అని సింగపూర్ ఎంబసీ ట్వీట్‌లో పేర్కొంది. ఫొటోలో బూడిద రంగు రెనాల్ట్‌ క్విడ్ కారు సింగపూర్‌ ఎంబసీ నంబర్‌ ప్లేటుతో ఎయిర్‌పోర్టులో పార్క్ చేసి ఉండటం చూడొచ్చు. భారత్‌లో రాయబార కార్యాలయాల సిబ్బందికి బ్లూ కలర్‌ నంబరు ప్లేటు కేటాయిస్తారు. అందులో  సీడీ (CD) అంటే దౌత్య సిబ్బంది అని అర్థం. సింగపూర్‌ ఎంబసీ ట్వీట్ చూసిన నెటిజన్లు.. దిల్లీ లాంటి నగరాల్లో భద్రతాపరంగా ఇది తీవ్రంగా పరిగణించాల్సిన అంశం, దిల్లీ పోలీసులు దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కామెంట్లు చేస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని