Shashi Tharoor: 1962లో నెహ్రూజీ 100 మంది ప్రసంగాలు విన్నారు: కేంద్రంపై థరూర్‌ విమర్శ

అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్‌ సెక్టార్‌లో జరిగిన భారత్‌-చైనా సరిహద్దు ఉద్రిక్తతలపై కేంద్ర ప్రభుత్వం వివరణ ఇవ్వకపోవడం ప్రజాస్వామ్యం అనిపించుకోదని కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ (Shashi Tharoor) మండిపడ్డారు. నాడు చైనా యుద్ధం సమయంలో నెహ్రూజీ పార్లమెంట్‌లో సుదీర్ఘ చర్చ జరిపిన విషయాన్ని గుర్తుచేశారు.

Published : 15 Dec 2022 02:17 IST

దిల్లీ: భారత్‌ - చైనా సరిహద్దు పరిస్థితి (Sino-Indian border issue)పై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో చర్చకు అంగీకరించకపోవడంపై కాంగ్రెస్‌ (Congress) సీనియర్‌ నేత శశిథరూర్‌ (Shashi Tharoor) మండిపడ్డారు. సరిహద్దు వివాదాలపై ఎలాంటి వివరణ లేకుండా కేవలం చిన్న ప్రకటన ఇవ్వడం ప్రజాస్వామ్యం కాదన్నారు. ఈ సందర్భంగా 1962 నాటి యుద్ధం సమయంలో అప్పటి ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ పార్లమెంట్‌లో వ్యవహరించిన తీరును గుర్తుచేస్తూ.. ప్రస్తుత నరేంద్రమోదీ సర్కారుపై విమర్శలు గుప్పించారు.

అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్‌ సెక్టార్‌లో యాంగ్జే ప్రాంతం వద్ద ఈ నెల 9న జరిగిన ఘటనకు సంబంధించి కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ (Rajnath Singh) మంగళవారం పార్లమెంట్‌లో ప్రకటన చేశారు. సరిహద్దుల్లోని యథాతథ స్థితిని మార్చేందుకు చైనా (China) సైన్యం చేసిన ప్రయత్నాలను మన సైనిక బలగాలు సాహసోపేతంగా తిప్పికొట్టాయని తెలిపారు. అయితే ఈ ప్రకటన అసమగ్రంగా ఉందని దీనిపై మరింత వివరణ కావాలని కాంగ్రెస్‌ నేతృత్వంలో విపక్షాలు డిమాండ్‌ చేశాయి. బుధవారం కూడా ప్రతిపక్షాలు ఇదే అంశాన్ని లేవనెత్తాయి. కానీ, సున్నితమైన అంశాలపై వివరణలు అడగడం కుదరదని పేర్కొంటూ లోక్‌సభ స్పీకర్‌, రాజ్యసభ ఛైర్మన్‌ సభలో చర్చకు అనుమతించలేదు. దీన్ని నిరసిస్తూ ప్రతిపక్షాలు ఉభయ సభల నుంచి వాకౌట్‌ చేశాయి.

ఈ అంశంపై సీనియర్‌ ఎంపీ శశిథరూర్‌ పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. ‘‘దేశ ప్రజలకు ప్రభుత్వం జవాబుదారీగా ఉండే వేదిక పార్లమెంట్‌. 2017లో ఢోక్లాం ఘటన దగ్గర్నుంచి డిసెంబరు 9న తవాంగ్‌ ఉద్రిక్తతల వరకు వాస్తవాధీన రేఖ వెంట చైనా కవ్వింపులకు పాల్పడుతూనే ఉంది. ఈ ఘటనలపై వాస్తవ పరిస్థితులను.. కేంద్ర ప్రభుత్వం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. కొన్ని ప్రశ్నలకు సమాధానమివ్వాల్సిందే. ఇది చాలా సాధారణం. 1962లో చైనాతో యుద్ధం జరిగిన సమయంలోనూ నెహ్రూజీ(అప్పటి ప్రధాని) పార్లమెంట్ సమావేశాలు నిర్వహించి చర్చ చేపట్టారు. అంతేగాక, దాదాపు 100 మంది సభ్యుల ప్రసంగాలను విని ఆ తర్వాత ప్రభుత్వం స్పందన వెల్లడించింది. అలాంటి నిర్మాణాత్మక చర్చలు జరగాలనే మేం కోరుకుంటున్నాం. అంతేగానీ ఇలా ఎవరి ప్రశ్నలను, అభిప్రాయాలను వినకుండా చిన్న ప్రకటనలు ఇచ్చి ఊరుకోవడం ప్రజాస్వామ్యం అనిపించుకోదు’’ అని థరూర్‌ అన్నారు. ఘటనకు సంబంధించి సున్నితమైన విషయాలు చెప్పమని ఎవరూ డిమాండ్‌ చేయట్లేదని, అయితే వాస్తవ పరిస్థితులెంటో ప్రభుత్వం వివరించాల్సిన అవసరముందన్నారు.

సరిహద్దుల విషయంపై భారత్‌, చైనా మధ్య కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదం 2020లో మరింత ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. ఆ ఏడాది జూన్‌లో గల్వాన్‌లో జరిగిన ఘర్షణల తర్వాత ఇరుదేశాల మధ్య ప్రతిష్టంభన నెలకొంది. దీనిపై ఇరు దేశాల సైనిక అధికారులు పలు దఫాలుగా చర్చలు జరిపిన అనంతరం సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణ చేపట్టారు. ఆ వివాదం ఇంకా పూర్తిగా తేలకముందే.. అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్‌ సెక్టార్‌లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఈ నెల 9వ తేదీన సరిహద్దు వెంబడి ఉన్న యథాతథ స్థితిని మార్చేందుకు చైనా సైన్యం ప్రయత్నించింది. భారత సైన్యం వారిని తిప్పికొట్టడంతో చైనా బలగాలు తిరిగి తమతమ స్థానాల్లోకి వెళ్లిపోయాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని