Updated : 22 Apr 2021 20:17 IST

దిల్లీలో ఆక్సిజన్‌ కొరత: వైద్యుల కంటతడి..!

చిన్న ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ కొరత తీవ్రం

దిల్లీ: దేశ రాజధానిలోని ఆసుపత్రులను మెడికల్‌ ఆక్సిజన్‌ కొరత వెంటాడుతూనే ఉంది. ఈ సంక్షోభం తీవ్రం కావడంతో రోగులకు చికిత్స అందించలేక ఆసుపత్రి యాజమాన్యాలు చేతులెత్తేస్తున్నాయి. ప్రాణాలను రక్షించాలని ఉన్నప్పటికీ.. ఏమీ చేయలేకపోతున్నామని వైద్యులే కన్నీటి పర్యంతం కావడం అక్కడి ప్రమాదకర పరిస్థితులకు అద్దం పడుతోంది. ఓ వైపు కోర్టుల ఆదేశాలు, కేంద్రప్రభుత్వం చొరవతో కొన్ని పెద్దాసుపత్రుల్లో ఆక్సిజన్‌ అందుబాటులోకి వస్తున్నప్పటికీ చిన్నాసుపత్రుల్లో మాత్రం దయనీయ పరిస్థితులు ఉన్నాయని వైద్యరంగ నిపుణులు వాపోతున్నారు.

దిల్లీ నగరంలో వైరస్‌ తీవ్రత పెరగడంతో అక్కడి ఆసుపత్రుల్లో చేరే రోగుల సంఖ్య ఎక్కువవుతోంది. దీంతో పలు ఆసుపత్రుల్లో కొన్ని గంటలకు మాత్రమే సరిపోయే ఆక్సిజన్‌ ఉన్నట్లు వాటి యాజమాన్యాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా ఆక్సిజన్‌ కొరతతో అక్కడి చిన్న ఆసుపత్రులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. తాజాగా నగరంలోని శాంతి ముకుంద్‌ ఆసుపత్రిలోనూ ఆక్సిజన్‌ కొరత ఏర్పడింది. రోగుల ప్రాణాలు రక్షించాలని ఉన్నప్పటికీ ఏమీ చేయలేని దుస్థితి ఏర్పడిందని ఆసుపత్రి సీఈఓ మీడియాకు వెల్లడిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. ఇలాంటి సమయంలో ‘క్యాన్సర్‌‌, హృద్రోగ సమస్యలు ఉన్న కొందరు కొవిడ్‌ రోగులకు ఆక్సిజన్‌ తప్పసరి అవుతోంది. కనీసం అది ఇవ్వకుంటే రోగి చనిపోతాడు. ఇది చాలా దురదృష్టకర, దుర్భరమైన పరిస్థితి’ అని ఆసుపత్రి సీఈఓ సునీల్‌ సాగర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సమయలో కాస్త తీవ్రత తక్కువగా ఉన్న రోగులను డిశ్చార్జి చేస్తున్నామని తెలిపారు. దిల్లీలోని చాలా ఆసుపత్రుల్లో ఇదే పరిస్థితి నెలకొన్నట్లు అక్కడి అధికారులు పేర్కొంటున్నారు. నిత్యం అక్కడ 700 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ అవసరం ఉన్నప్పటికీ కేవలం 400 మెట్రిక్‌ టన్నులు మాత్రమే అందుబాటులో ఉంటోందని చెబుతున్నారు.

6 ఆసుపత్రుల్లో నిండుకున్న ఆక్సిజన్‌

దేశ రాజధానిని మెడికల్‌ ఆక్సిజన్‌ కొరత వెంటాడుతోంది. మొత్తం ఆరు ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ నిండుకున్నట్లు దిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. ఆక్సిజన్‌ అందుబాటులో ఉంచాలని దిల్లీ హైకోర్టు కేంద్రాన్ని ఆదేశించిన కొద్ది గంటల్లోనే ఈ ఆరు ఆసుప్రతుల్లో ఆక్సిజన్‌ ఖాళీ కావడం గమనార్హం. దేశ రాజధాని దిల్లీ ఆసుపత్రుల్లో మెడికల్‌ ఆక్సిజన్‌ లభ్యతపై అక్కడి ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. తాజాగా ఆరు ఆసుపత్రుల్లో పూర్తిగా మెడికల్‌ ఆక్సిజన్‌ కొరత ఏర్పడినట్లు దిల్లీ ఆరోగ్యశాఖ పేర్కొంది. సరోజ్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి, శాంతి ముకుంద్‌ ఆసుప్రతి, తీరథ్‌ రామ్‌షా ఆసుపత్రి, యూకే నర్సింగ్‌ హోం, రథి ఆసుపత్రి, సాంటమ్‌ ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ నిండుకున్నట్లు దిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. ఇక హోలీ ఫ్యామిలీ ఆసుపత్రిలోనూ కేవలం రెండు గంటలకు సరిపడా ఆక్సిజన్‌ మాత్రమే ఉన్నట్లు పేర్కొంది. అయితే, ఆక్సిజన్‌ కొరతను అధిగమించేందుకు సరిహద్దు రాష్ట్రాలతో పాటు ఒడిశా నుంచి తెప్పించేందుకు దిల్లీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

హరియాణా, యూపీపై మండిపడ్డ దిల్లీ ఉపముఖ్యమంత్రి

ఆక్సిజన్‌ కొరతతో సతమతమవుతున్న దిల్లీకి వీటిని సరఫరా చేయకుండా హరియాణా ప్రభుత్వం అడ్డుకుంటోందని దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా విమర్శించారు. ఫరీదాబాద్‌ నుంచి ఆక్సిజన్‌ వాహనాలను అధికారులు అడ్డుకోవడం పట్ల సిసోడియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి ఇదే విధమైన చేదు అనుభవం ఎదురవుతున్నట్లు పేర్కొన్నారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని