Rajiv Gandhi: నాన్నా.. ప్రేరణ రూపంలో నువ్వెప్పుడూ నాతోనే ఉన్నావు: రాహుల్‌ గాంధీ

మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ వర్థంతి సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీశ్రేణులు ఆయనకు నివాళులర్పిస్తున్నాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నేత రాహుల్‌.. తన తండ్రి రాజీవ్‌ను గుర్తు చేసుకొంటూ ఓ భావోద్వేగపూరిత ట్వీట్‌ చేశారు.

Updated : 21 May 2023 12:51 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ 32వ వర్థంతి సందర్భంగా దేశ వ్యాప్తంగా ఆయనకు నివాళులర్పిస్తున్నారు. ఆయన కుమారుడు కాంగ్రెస్‌ (Congress) నేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi ) ట్విటర్‌ వేదికగా భావోద్వేగ పోస్టు చేశారు. ‘‘నాన్నా.. ఒక ప్రేరణ రూపంలో, జ్ఞాపకాలుగా మీరు సదా నాతోనే ఉన్నారు’’ అని పేర్కొన్నారు. దీంతోపాటు రాజీవ్‌ జ్ఞాపకాలను గుర్తు చేసే ఓ వీడియోను కూడా ఆయన జత చేశారు. ఆయన ఆదివారం ఉదయం తన సోదరి ప్రియాంకాగాంధీ వాద్రా(Priyanka Gandhi Vadra)తో కలిసి రాజీవ్‌ గాంధీ సమాధి వద్ద నివాళులర్పించారు. మరోవైపు కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ(Sonia Gandhi), పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) దిల్లీలో రాజీవ్‌ గాంధీకి నివాళి అర్పించారు.

1944 ఆగస్టు 20వ తేదీన రాజీవ్‌ జన్మించారు. తల్లి ఇందిరాగాంధీ హత్య తర్వాత 1984లో పార్టీ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు స్వీకరించారు. 40 సంవత్సరాల వయసులోనే 1984 అక్టోబర్‌లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టి రికార్డు సృష్టించారు. 1989 అక్టోబర్‌ 2వ తేదీ వరకు ఆయన ఆ బాధ్యతల్లో కొనసాగారు. 1991 మే 21న తమిళనాడులోని శ్రీపెరుంబుదూరులో ఉగ్ర సంస్థ ఎల్‌టీటీఈ బృందం చేసిన ఆత్మాహుతి దాడిలో రాజీవ్‌ కన్నుమూశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని