Job Quota: ప్రైవేటులో 75శాతం కోటా.. హరియాణా ప్రభుత్వానికి సుప్రీంలో ఊరట

ప్రైవేటు ఉద్యోగాల్లో స్థానికులకు 75శాతం కోటా కల్పిస్తూ హరియాణా ప్రభుత్వం చేసిన చట్టం చెల్లదని హైకోర్టు ఇచ్చిన మధ్యంతర తీర్పుపై స్టే విధించింది.

Published : 18 Feb 2022 01:33 IST

హైకోర్టు ఉత్తర్వులపై స్టే

దిల్లీ: ప్రైవేటు ఉద్యోగాల్లో స్థానికులకు 75శాతం రిజర్వేషన్ల అంశంపై హరియాణా ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. స్థానికులకు 75శాతం కోటా కల్పిస్తూ హరియాణా ప్రభుత్వం చేసిన చట్టం చెల్లదని హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. నెలలోపు ఈ సమస్యపై నిర్ణయం తీసుకోవాలని పంజాబ్‌-హరియాణా హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది. ఇదే సమయంలో అప్పటివరకు యాజమాన్యాలపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని హరియాణా ప్రభుత్వాన్ని ఆదేశించింది.

స్థానిక రిజర్వేషన్లపై హరియాణా ప్రభుత్వం చేసిన చట్టం చెల్లదని పంజాబ్‌-హరియాణా ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. హైకోర్టు పూర్తి విచారణ చేయకుండానే తీర్పు ఇచ్చిందని.. కేవలం 90 సెకండ్లలోనే విచారణ పూర్తి చేసిందని సుప్రీం కోర్టులో వాదించింది. వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం.. ఈ అంశంపై నాలుగు వారాల్లో పూర్తి విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని హైకోర్టుకు సూచించింది.

ప్రైవేటు రంగం ఉద్యోగాల్లో స్థానికులకే 75 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ ప్రభుత్వం గతేడాది నూతన చట్టాన్ని తీసుకువచ్చింది. అయితే, దీనిపై ప్రైవేటు రంగం, పారిశ్రామికవేత్తల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం పారిశ్రామిక రంగానికి తీవ్ర నష్టం కలిగించడంతోపాటు పెట్టుబడులపైనా తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలు ప్రైవేటు సంస్థలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. వాటిని విచారించిన పంజాబ్‌-హరియాణా హైకోర్టు.. చట్టం అమలును తాతాల్కికంగా నిలుపుదల చేసింది. దీనిని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాలు చేసింది. చివరకు హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీం కోర్టు స్టే విధించడంతో హరియాణా ప్రభుత్వానికి ఊరట లభించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని