Taliban: ‘అమెరికా మాకు చెప్పాల్సింది.. డ్రోన్ దాడి ఏకపక్ష నిర్ణయం’

అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబుల్‌లోని ఎయిర్‌పోర్టు వద్ద పేలుళ్లకు కుట్ర పన్నిన ఉగ్రవాదులను అమెరికా డ్రోన్‌దాడితో మట్టుబెట్టడాన్ని తాలిబన్లు ఖండించారు.

Published : 30 Aug 2021 16:44 IST

ఖండించిన తాలిబన్లు

కాబుల్‌: అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబుల్‌లోని ఎయిర్‌పోర్టు వద్ద పేలుళ్లకు కుట్ర పన్నిన ఉగ్రవాదులను అమెరికా డ్రోన్‌దాడితో మట్టుబెట్టడాన్ని తాలిబన్లు ఖండించారు. అది పూర్తిగా ఏకపక్ష నిర్ణయమని, దాని వల్ల పౌరులు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని తాలిబన్‌ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్‌ చైనా అధికారిక మీడియా ఛానల్‌కు చెప్పినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. 

‘‘అఫ్గానిస్థాన్‌లో ఉగ్ర ముప్పు ఉందని తెలిస్తే.. వారు(అమెరికాను ఉద్దేశిస్తూ) ముందు మాకు సమాచారం ఇవ్వాల్సింది. అంతేగానీ, ఇలా ఏకపక్ష దాడులు చేయకూడదు. ఆ డ్రోన్‌ దాడి వల్ల ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. విదేశీ గడ్డపై అమెరికా చర్య పూర్తిగా చట్టవ్యతిరేకం’’ అని ముజాహిద్‌ ఖండించినట్లు సదరు కథనాలు వెల్లడించాయి. గత శనివారం కూడా అమెరికా డ్రోన్‌ దాడి జరిపి ఇద్దరు ఇస్లామిక్‌ స్టేట్‌ ముష్కరులను హతమార్చగా.. ఆ దాడిని కూడా తాలిబన్లు ఖండించడం గమనార్హం. 

కాబుల్‌లోని హమీద్‌ కర్జాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద గత గురువారం నరమేధానికి పాల్పడ్డ ఐఎస్‌ఐఎస్‌-కె ఉగ్ర సంస్థ ఆదివారం మరోసారి అలాంటి దాడికి వ్యూహరచన చేసింది. ఆత్మాహుతి దాడికి పాల్పడేందుకు ఓ వాహనంలో ముష్కరులు దూసుకురావడాన్ని అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ గుర్తించింది. వెంటనే డ్రోన్‌ దాడి జరిపి ఉగ్రవాదులను హతమార్చింది. ఈ దాడి అనంతరం భారీగా పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో పౌరులు ప్రాణాలు కోల్పోవడంపై దర్యాప్తు చేస్తున్నట్లు అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని