Omicron: ‘నలుగురు కాపలా కాశారు’.. ఒమిక్రాన్‌ నుంచి కోలుకున్న ఓ యువకుడి అనుభవాలివీ!

ఒమిక్రాన్‌ విషయంలో భయపడాల్సిన అవసరం లేదంటూ.. ఈ వేరియంట్‌ నుంచి కోలుకున్న ఓ యువ వ్యాపారి తాజాగా తన అనుభవాలను పంచుకున్నాడు......

Updated : 21 Dec 2021 22:37 IST

దిల్లీ: కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్ ప్రపంచాన్ని కలవరపరుస్తోంది. వేగంగా వ్యాప్తి చెందే లక్షణాలు ఉండటంతో దీనిపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే, ఈ వేరియంట్‌ విషయంలో భయపడాల్సిన అవసరం లేదంటూ ఒమిక్రాన్‌ నుంచి కోలుకున్న ఓ యువ వ్యాపారి తాజాగా తన అనుభవాలను పంచుకున్నాడు. దిల్లీకి చెందిన ఈ 27 ఏళ్ల యువకుడు ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. కొత్త వేరియంట్‌ ప్రాణాంతకం కాదని, నూరు శాతం నమ్మకంతో ఈ విషయం చెబుతున్నానని అన్నాడు.

పాజిటివ్‌ అని చెబితే షాకయ్యా..

వ్యాపారం నిమిత్తం నవంబర్ 20న దుబాయ్‌కి వెళ్లిన ఆ యువ వ్యాపారి.. డిసెంబర్ 4న తిరుగు పయనమయ్యాడు. మొదట దుబాయ్‌లో కొవిడ్‌ నెగెటివ్‌గా తేలినా.. దిల్లీ విమానాశ్రయంలో మాత్రం పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల వ్యాప్తి మొదలవడంతో దిల్లీలోనూ అతడి నమూనాలు సేకరించారు. అక్కడినుంచి నేరుగా ఇంటికి వచ్చిన అతడు.. హోం ఐసొలేషన్‌లోకి వెళ్లాడు. తీరా రెండు రోజుల తరువాత ఒమిక్రాన్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు సమాచారం అందించారు. ‘అసలు నాకు ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలడం ఏంటని షాకయ్యా. ఒక్క లక్షణం కూడా లేకపోవడంతో మరోసారి పరీక్షలు చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశా’ అని గుర్తుచేసుకున్నాడు. అప్పటికే టీకా రెండు డోసులు తీసుకున్నట్లు చెప్పాడు.

ఆసుపత్రిలో క్వారంటైన్‌ చేశారు..

ఒమిక్రాన్‌ సోకినట్లు సమాచారం అందిన కొద్ది సేపటికే నార్త్‌ దిల్లీలోని అతని ఇంటి బయట నలుగురు గార్డులు ప్రత్యక్షమయ్యారు. ‘ఇది ఒత్తిడితో కూడుకున్న అనుభవం. నేను, నా కుటుంబం హోం ఐసొలేషన్‌లోనే ఉండేలా నలుగురు గార్డులను రాత్రింబవళ్లు కాపలా ఉంచారు. అనంతరం ఓ అంబులెన్సులో నన్ను లోక్‌నాయక్ జయప్రకాశ్‌ నారాయణ్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు’ అని చెప్పాడు. ‘నాకు గొంతు నొప్పి లేదు. ఒక్కరోజు కూడా జ్వరం రాలేదు. పరీక్షలు చేయకపోతే కొవిడ్ ఉందని కూడా చెప్పలేని పరిస్థితి. ఆసుపత్రిలో నన్ను క్వారంటైన్‌లో ఉంచారు. ఆ సమయంలో అక్కడ మొత్తం 40 మంది రోగులు ఉన్నారు. వారిలో 30-35 మందికి ఎటువంటి లక్షణాలూ లేవు. అసలు ఆస్పత్రిలో ఏం చేస్తున్నాం.. ఇక్కడ ఎందుకు ఉంచారని మేమంతా అనుకునేవాళ్లం’ అని అతడు ఆసుపత్రిలోని తన అనుభవాలు వివరించాడు.

ఇంట్లో ఎవరికీ సోకలేదు..

పాజిటివ్‌గా ఉన్న సమయంలో మందులు వేసుకోవడానికీ నిరాకరించినట్లు ఆ యువకుడు చెప్పాడు. ‘డెల్టా వేరియంట్‌ ప్రమాదకరమైంది. కానీ, ఒమిక్రాన్ కాదు! నా కారణంగా కుటుంబంలో ఎవరికీ ఈ వైరస్‌ సోకలేదు’ అని అతను తెలిపాడు. తాజాగా రెండు సార్లు పరీక్షించగా, నెగెటివ్‌గా వచ్చినట్లు చెప్పాడు. ‘ఒమిక్రాన్‌కు భయపడాల్సిన అవసరం లేదు. ఇది ప్రాణాంతకం కాదు.. నూటికి 110 శాతం నమ్మకంతో చెబుతున్నా’ అని ధీమా వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు