Pfizer: ఫైజర్‌ టీకాకు పూర్తి స్థాయి అనుమతి.. అమెరికా ఎఫ్‌డీఏ ఆమోదం

ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ వినియోగానికి పూర్తిస్థాయి అనుమతులు లభించాయి. 16ఏళ్ల వయసుపైబడిన వారికి ఈ వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (FDA) ఆమోదం తెలిపింది.

Updated : 24 Aug 2021 00:11 IST

వాషింగ్టన్‌: ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ వినియోగానికి పూర్తిస్థాయి అనుమతులు లభించాయి. 16 ఏళ్ల వయసు పైబడిన వారికి ఈ వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (FDA) ఆమోదం తెలిపింది. ఇప్పటివరకు కేవలం అత్యవసర వినియోగం (EUA)కింద ఫైజర్‌కు అనుమతి లభించగా.. ఇక నుంచి పూర్తి వినియోగానికి ఆమోదం లభించినట్లయ్యింది. దీంతో తొలిసారిగా పూర్తి స్థాయి అనుమతులు పొందిన కరోనా వ్యాక్సిన్‌గానూ ఫైజర్‌ నిలిచింది.

కరోనా వైరస్‌పై జరుగుతున్న పోరాటంలో ఫైజర్‌ రూపొందించిన వ్యాక్సిన్‌కు ఎఫ్‌డీఏ ఆమోదం ఇవ్వడం కీలక మైలురాయి అని ఎఫ్‌డీఏ కమిషనర్‌ జానెట్‌ వూడ్‌కాక్‌ పేర్కొన్నారు. ఇప్పటికే కొన్ని కోట్ల మంది ఈ సురక్షితమైన వ్యాక్సిన్‌ను పొందారని.. మరింత మందిలో వ్యాక్సిన్‌ల పట్ల విశ్వాసాన్ని కలిగించేందుకు తాజా నిర్ణయం దోహదపడుతుందని చెప్పారు.

ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ 95 శాతానికి పైగా ప్రభావశీలత ఉన్నట్లు ప్రయోగ ఫలితాల్లో వెల్లడైంది. లక్షణాలున్న రోగుల్లోనూ సమర్థంగా పనిచేస్తున్నట్లు ఫార్మా కంపెనీల విశ్లేషణలో తేలింది. ఇజ్రాయెల్‌లో జరిపిన వాస్తవ ఫలితాల విశ్లేషణలో ఫైజర్‌ టీకా 97శాతం సమర్థత చూపించింది. ఇక కొత్తగా వెలుగు చూస్తున్న వేరియంట్లపైనా ఫైజర్‌ టీకా సమర్థంగా పనిచేస్తున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని