Harbhajan Singh: రాజకీయాల్లో చేరడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: భజ్జీ

భారత క్రికెట్‌ నుంచి హర్భజన్ సింగ్ నిన్న వీడ్కోలు పలికాడో లేదో అప్పుడే అతడి భవిష్యత్తు కార్యాచరణపై అనేక వార్తలు వినిపిస్తున్నాయి.

Published : 25 Dec 2021 21:05 IST

జలంధర్‌: భారత క్రికెట్‌ నుంచి హర్భజన్ సింగ్ నిన్న వీడ్కోలు పలికాడో లేదో అప్పుడే అతడి భవిష్యత్తు కార్యాచరణపై అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన రాజకీయాల్లో చేరతారంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. దీనిపై తాజాగా భజ్జీ స్పందించాడు. తనకు అనేక పార్టీల నుంచి ఆఫర్లు వస్తున్నాయని, అయితే తానింకా తదుపరి ప్రణాళికపై నిర్ణయం తీసుకోలేదని వెల్లడించాడు. 

‘నా భవిష్యత్తు ప్రణాళికపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. నేను క్రికెట్‌తో నా అనుబంధాన్ని కొనసాగిస్తాను. ఎందుకంటే ఆ ఆట వల్లే ప్రజలు నన్ను గుర్తుపడుతున్నారు. రాజకీయ భవిష్యత్తు గురించి నేను ఏదైనా నిర్ణయం తీసుకుంటే, అందరికీ తెలియజేస్తాను. నిజం చెప్పాలంటే..నాకు దాని  గురించి ఎలాంటి ఆలోచన లేదు. తమతో చేరాలంటూ చాలా పార్టీల నుంచి ఆఫర్లు వస్తున్నాయి. వాటిపై నేను ఆలోచించుకోవాల్సి ఉంది. రాజకీయాల్లోకి వెళ్లడం అనేది చిన్న విషయం కాదు. నేను సిద్ధంగా ఉన్నాననుకున్న రోజు ముందుకెళ్తాను’ అని హర్భజన్ స్పష్టం చేశారు. 

అలాగే పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూతో భేటీ అయిన విషయం గురించి అడగ్గా.. ‘మామూలుగానే కలిశాం. ఎన్నికల వేళ కలవడంతో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ నేను రాజకీయాల్లో రావాలనుకుంటే.. అందరికీ చెప్తాను’ అని వెల్లడించారు. వచ్చే ఏడాది ప్రారంభంలో పంజాబ్ రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనుంది. ఈ ఎన్నికలను భాజపా, కాంగ్రెస్‌ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. దాంతో రెండు పార్టీలు జనాకర్షక నేతలపై దృష్టిపెట్టాయి. ఈ క్రమంలోనే హర్భజన్‌ను తమ పార్టీలోకి తీసుకోవాలని ఇరు పార్టీలు భావిస్తున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని