India Corona: ప్రమాదకరంగా విస్తరిస్తోన్న కరోనా.. వారం రోజుల్లో ఐదు రెట్లు పెరిగిన కొత్త కేసులు..!

దేశంలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. వారం వ్యవధిలో కేసులు సమారు ఐదు రెట్లు అదనంగా నమోదయ్యాయి.

Updated : 03 Jan 2022 16:16 IST

1700కు పెరిగిన ఒమిక్రాన్ బాధితులు

దిల్లీ: దేశంలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. వారం వ్యవధిలో కేసులు సమారు ఐదు రెట్లు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గత సోమవారం 6,358 కరోనా కేసులు రాగా.. ఈ సోమవారం ఆ సంఖ్య 33 వేలకు పెరిగింది. దేశంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విస్తరిస్తోన్న సమయంలో ఈ భారీ పెరుగుదల కనిపిస్తోంది. ఇది కొత్త వేరియంట్‌ సామాజిక వ్యాప్తిని సూచిస్తోందని నిపుణులు ఇప్పటికే వెల్లడించారు. దాంతో పలు రాష్ట్రాలు కొవిడ్ ఆంక్షల వైపు మొగ్గుచూపుతున్నాయి. 

 ప్రస్తుతం దేశంలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య  1,700కి చేరింది. 24 గంటల వ్యధిలో 175 కొత్త కేసులొచ్చాయి. ఒక్క మహారాష్ట్రలోనే 510 కొత్త రకం కేసులున్నాయి. నిన్న అక్కడ 50 మంది దీని బారినపడ్డారు. తర్వాతి స్థానంలో దిల్లీ ఉంది. దేశ రాజధానిలో ఒమిక్రాన్‌ కేసులు 351గా ఉన్నాయి. ఇప్పటివరకు 639 మంది కోలుకున్నారు. అలాగే 23 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ వేరియంట్ విస్తరించింది.

నిన్న సెలవురోజు కావడంతో 8.78 లక్షల నిర్ధారణ పరీక్షలే నిర్వహించారు. పరీక్షల సంఖ్య తగ్గినప్పటికీ..  33,750 మందికి కరోనా సోకినట్లు సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇందులో మహారాష్ట్రలో అత్యధిక కేసులు ఉన్నాయి. అక్కడ 11,877 మందిలో వైరస్ నిర్ధారణ అయింది. ఇక దేశంలో మొత్తం కేసులు 3.49 కోట్లకు చేరాయి. క్రియాశీల కేసులు 1,45,582కి ఎగబాకాయి. నిన్న 10వేల మంది కోలుకోగా.. మొత్తం రికవరీలు 3.42 కోట్లుగా ఉన్నాయి. క్రియాశీల రేటు 0.42 శాతానికి పెరగ్గా.. రికవరీ రేటు 98.20 శాతానికి పడిపోయింది. 24 గంటల వ్యవధిలో 123 మంది మరణించారు. ఇప్పటివరకు 4,81,893 మంది మహమ్మారికి బలయ్యారు.

మరోపక్క దేశంలో కరోనా టీకా కార్యక్రమం సజావుగా సాగుతోంది. ఈ కార్యక్రమం మరో దశలోకి అడుగుపెట్టింది. ఈ రోజు నుంచి 15 నుంచి 18 ఏళ్ల వయస్సువారు టీకా తీసుకుంటున్నారు. వారికి కొవాగ్జిన్ టీకాను మాత్రమే వేస్తున్నారు. అలాగే నిన్న దేశం మొత్తం మీద 23,30,706 మంది టీకా తీసుకున్నారు. నిన్నటివరకు 145.6కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి.

సహజ వ్యాక్సిన్‌ అనుకోవడం ప్రమాదకరమే..!

యావత్‌ ప్రపంచాన్ని ఒమిక్రాన్‌ వేరియంట్‌ వణికిస్తున్నప్పటికీ దాని వల్ల వ్యాధి తీవ్రత, ఆస్పత్రి ముప్పు తక్కువేనని అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇదే సమయంలో ఒమిక్రాన్ వేరియంట్‌ సహజ వ్యాక్సిన్‌గా దోహదం చేస్తుందని కొందరు భావిస్తున్నారు. అయితే, ఒమిక్రాన్‌ వేరియంట్‌ నేచురల్‌ వ్యాక్సిన్‌గా పనిచేస్తుందనే ఆలోచన ప్రమాదకరమైందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా దీర్ఘ కొవిడ్‌ (Long Covid) పర్యవసానాలపై స్పష్టత లేనందున అటువంటి ఆలోచన మంచిది కాదన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని