
AK-203: ఇక 6లక్షల రష్యా రైఫిల్స్ తయారీ భారత్‌లోనే..!
ఒప్పందంపై రష్యా, భారత్ రక్షణశాఖ మంత్రుల సంతకాలు
దిల్లీ: అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఏకే-203 రైఫిల్స్ కొనుగోలుపై రష్యా, భారత్‌ల మధ్య ఇటీవలే ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వీటిని భారత్‌లోనే తయారు చేసి మన సైన్యానికి అందించే ఒప్పందంపై ఇరు దేశాలు నేడు సంతకాలు చేశాయి. టెక్నాలజీ రష్యాదే అయినప్పటికీ వీటిని ఉత్తర్‌ప్రదేశ్ అమేఠీలో సంయుక్తంగా తయారు చేసే ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. ఈ ఒప్పందంతో దాదాపు రూ.5వేల కోట్ల విలువైన 6లక్షలకుపైగా ఏకే-203 రైఫిల్‌లు భారత్‌లోనే తయారు కానున్నాయి. వీటితో పాటు రానున్న 10ఏళ్లు రక్షణ సహకారంపైనా ఇరుదేశాల రక్షణశాఖ మంత్రులు ఒప్పందం చేసుకున్నారు.
రూ. 5వేల కోట్ల విలువ..
భారత్, రష్యాల మధ్య నేడు జరుగుతోన్న ద్వైపాక్షిక వార్షిక సదస్సులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. ఈ కీలక సమావేశానికి ముందే ఇరు దేశాల రక్షణ, విదేశాంగ శాఖల మంత్రుల ‘2+2 భేటీ’ జరిగింది. ఇందులో భాగంగా రష్యా రక్షణశాఖ మంత్రి సెర్గీ షొయిగుతో భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమావేశమయ్యారు. ముఖ్యంగా సైనిక పరికరాలను ఉత్పత్తిని ఉమ్మడిగా తయారు చేయడంతోపాటు వ్యూహాత్మక సహకారాన్ని మరింత పెంపొందించే మార్గాలపై ఇరువురు మంత్రులు చర్చించారు. వీటితో పాటు కలాష్నికోవ్ ఆయుధాలపై 2019లో జరిగిన ఒప్పందాలకు పలు సవరణలకు అంగీకారం తెలిపారు. ఈ రోజు మొత్తం నాలుగు అంశాలపై ఇరుదేశాలు ఒప్పందం చేసుకోగా వాటిలో అతిముఖ్యమైనది మాత్రం AK-203 రైఫిల్స్ తయారీదేనని అధికార వర్గాలు వెల్లడించాయి.
చర్చల అనంతరం మాట్లాడిన భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. రష్యాతో భారత్‌కు దీర్ఘకాల అనుబంధం ఉండడంతోపాటు ప్రత్యేకమైన వ్యూహాత్మక భాగస్వామి అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వివిధ అంశాల్లో భారత్‌కు రష్యా అందిస్తోన్న సహకారాన్ని ఆయన ప్రశంసించారు. అయితే ఈ సన్నిహిత సహకారం మాత్రం మరే దేశాన్ని లక్ష్యంగా చేసుకునేందుకు కాదని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు.
ద్వైపాక్షిక వార్షిక సదస్సులో భాగంగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్‌తో భారత విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి ఎస్.జైశంకర్ చర్చలు జరిపారు. అనంతరం చర్చలపై సంతృప్తి వ్యక్తం చేసిన ఎస్. జయశంకర్.. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయాల్లో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నప్పటికీ భారత్, రష్యాల మధ్య సంబంధాలు సుస్థిరంగా, బలంగా ఉన్నాయని ఉద్ఘాటించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.