Omicron: సాధారణ, సులభ చికిత్సతోనే ఒమిక్రాన్‌ నుంచి విముక్తి

ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్‌ గుబులురేపుతున్న తరుణంలో దక్షిణాఫ్రికాకు చెందిన వైద్య నిపుణురాలు కాస్త ఉపశమనం కలిగించే వార్త వెల్లడించారు......

Published : 22 Dec 2021 01:23 IST

కేప్‌టౌన్‌: ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. అనేక దేశాల్లో రోజురోజుకు కొత్త కేసులు పెరిగిపోతుండటంతో ఆయా దేశాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాకు చెందిన వైద్య నిపుణురాలు కాస్త ఉపశమనం కలిగించే వార్త వెల్లడించారు. ఒమిక్రాన్‌ను తొలుత గుర్తించిన డా.ఏంజెలిక్ కోయెట్జీ మాట్లాడారు. తమ దేశంలోని చాలా మంది సాధారణ, సులభమైన చికిత్సతో ఈ వేరియంట్‌ నుంచి కోలుకుంటున్నట్లు తెలిపారు. బాధితుల్లో స్వల్ప లక్షణాలే ఉన్నాయన్నారు. ఒమిక్రాన్‌ మొట్టమొదట అక్కడే వెలుగుచూసిన విషయం తెలిసిందే.

‘రోగ నిర్ధరణ అయిన తర్వాత వెంటనే.. తక్కువ మోతాదులో కార్టిసోన్, ఐబూప్రొఫెన్ వంటి ఔషధాలతో కండరాల నొప్పి, తలనొప్పికి చికిత్స అందిస్తున్నామంతే. ఇంకేమీ లేదు. మరే ఔషధాలను ఇవ్వడం లేదు. ఆక్సిజన్ లేదు, యాంటీబయాటిక్స్ కూడా అవసరం లేదు’ అని డా.ఏంజెలిక్ పేర్కొన్నారు. ఒమిక్రాన్‌ లక్షణాలపై ఆమె మాట్లాడుతూ.. ‘ఇప్పటివరకు నమోదైన కేసుల్లో చాలా వరకు ఒళ్లు నొప్పులు, తలనొప్పి, అలసట వంటి లక్షణాలే కనిపించాయి. కొందరికి మాత్రమే పొడి దగ్గు, గొంతు గరగర ఉంటోంది’ అని వివరించారు.

టీకా తీసుకోని వారు వ్యాధి ప్రభావానికి ఎక్కువగా గురికావడం, ఆస్పత్రుల్లో చేరే అవకాశాలు అధికంగా ఉన్నాయని వైద్యురాలు వెల్లడించారు. అయితే టీకా ఒక్క డోసు తీసుకున్నవారిలో కూడా ఈ వేరియంట్‌ లక్షణాలు స్వల్పంగానే కనిపించాయన్నారు. దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ బాధితుల్లో చాలా తక్కువ మందికి మాత్రమే ఐసీయూలో చికిత్స అందించాల్సి వచ్చిందన్నారు. డెల్టాతో పోలిస్తే ఈ వేరియంట్‌ చిన్నారులపై ఎక్కువ ప్రభావం చూపించలేదని ఆమె స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని