Politics: గోవాలో ఎవరు గెలిస్తే.. లోక్‌సభ ఎన్నికల్లోనూ వారిదే విజయం..!

వచ్చే ఏడాది జరుగనున్న గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తప్పక విజయం సాధిస్తుందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పీ చిదంబరం అశాభావం వ్యక్తం చేశారు.

Published : 14 Oct 2021 18:25 IST

ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ నేత పీ చిదంబరం

పనాజీ: వచ్చే ఏడాది జరుగనున్న గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తప్పక విజయం సాధిస్తుందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పీ చిదంబరం అశాభావం వ్యక్తం చేశారు. ఇదే తరహాలో 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ గెలుస్తుందన్నారు. గోవాలో ఏ ఫలితం వస్తుందో.. దిల్లీలోనూ అవే ఫలితాలు పునరావృతం అవుతాయనే విషయాన్ని చరిత్ర చెబుతోందని గుర్తుచేశారు. కాంగ్రెస్‌ పార్టీ గోవా ఎలక్షన్‌ ఇంఛార్జీగా ఉన్న  ఆయన.. పనాజీలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడారు.

‘చరిత్రను చూస్తే.. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తే.. లోక్‌సభ ఎన్నికల్లో వారిదే గెలుపు. 2007లో గోవాలో కాంగ్రెస్‌ గెలిచింది. అనంతరం 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మాదే విజయం. ఇక 2012లో గోవాలో ఓటమి పాలయ్యాం. తర్వాత 2014లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి చెందాం. 2017లోనూ మా పార్టీ నేతలు ఇక్కడ ఓటమి చెందారు. తర్వాత 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడిపోయింది’ అని  విశ్లేషించారు. అయితే, ఈసారి (2022 గోవా అసెంబ్లీ ఎన్నికల్లో) మాత్రం విజయం కాంగ్రెస్‌దేనని.. దాంతో 2024లో దిల్లీలోనూ గెలుపు మాదేనని చిదంబరం ఆశాభావం వ్యక్తం చేశారు. గోవాలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పటి అభివృద్ధిని గుర్తుచేసుకోవాలని.. 2022 నుంచి మళ్లీ గోవాలో స్వర్ణయుగం ఆరంభం అవుతుందని అన్నారు. గోవాకు చెందిన వారి చేతిలోనే గోవా పాలన నడుస్తుందనే నినాదాన్ని  వినిపించారు.

ఇదిలాఉంటే, 40 అసెంబ్లీ స్థానాలున్న గోవా అసెంబ్లీలో 2017 ఎన్నికల్లో కాంగ్రెస్‌ 17 స్థానాల్లో గెలుపొందింది. దీంతో అత్యధిక సీట్లు గెలుచుకున్న పార్టీగా నిలిచింది. కానీ, 13 స్థానాల్లో గెలిచిన భాజపా మాత్రం ఇతర ప్రాంతీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో కలిసి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అనంతరం చోటుచేసుకున్న పార్టీ ఫిరాయింపులు, రాజీనామాలతో ప్రస్తుతం కాంగ్రెస్‌ బలం నాలుగుకు దిగజారింది. ఈ మధ్యే కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, గోవా మాజీ ముఖ్యమంత్రి లుజినో ఫలైరో కాంగ్రెస్‌ను వీడి తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరారు. ఈసారి గోవా ఎన్నికల్లో కాంగ్రెస్‌, భాజపాకు దీటుగా తృణమూల్‌, ఆమ్‌ఆద్మీ పార్టీలు గట్టి పోటీని ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని