Booster Dose: బూస్టర్‌ డోసు వినియోగానికి WHO సిఫార్సు..!

బలహీన రోగనిరోధక వ్యవస్థ ఉన్నవారికి బూస్టర్‌ డోసు అవసరమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల కమిటీ వెల్లడించింది.

Updated : 12 Oct 2021 15:39 IST

ముందుగా వారికే ఇవ్వాలన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ

జెనీవా: కరోనా వ్యాక్సిన్‌ను రెండు మోతాదుల్లో తీసుకున్నప్పటికీ.. మూడో డోసు అవసరమని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బలహీన రోగనిరోధక వ్యవస్థ ఉన్నవారికి బూస్టర్‌ డోసు అవసరమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల కమిటీ వెల్లడించింది. బూస్టర్‌ డోసుల వినియోగం గురించి ఇమ్యూనైజేషన్‌పై ఏర్పాటైన వ్యూహాత్మక సలహాల నిపుణుల బృందం (SAGE) నాలుగు రోజులు చర్చించిన అనంతరం ఈ సిఫార్సు చేసింది. వీటికి సంబంధించిన తుది నివేదిక డిసెంబరులో విడుదల చేస్తామని ప్రకటించింది.

‘రోగనిరోధక వ్యవస్థ మధ్యస్థాయి నుంచి తీవ్ర బలహీనంగా ఉండే వ్యక్తులకు రెండు డోసులు ఇచ్చినప్పటికీ వాటికి తగిన విధంగా స్పందించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. దీంతో బలహీన రోగనిరోధకత ఉన్నవారు తీవ్ర కొవిడ్‌-19 బారినపడే ప్రమాదం ఉంటుంది. అందుచేత డబ్ల్యూహెచ్‌ఓ ఆమోదం పొందిన వ్యాక్సిన్‌ డోసులకు అదనంగా మరో డోసు ఇవ్వాల్సిన అవసరం ఉంది’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల బృందం పేర్కొంది. ఇక చైనాకు చెందిన సినోవాక్‌, సినోఫార్మ్‌ వ్యాక్సిన్‌లు తీసుకున్న 60ఏళ్ల పైబడిన వ్యక్తులు తప్పనిసరిగా మూడో డోసు తీసుకోవాలని స్పష్టం చేసింది. వీటితో పాటు ఇతర వ్యాక్సిన్‌ల లభ్యతను బట్టి ఆయా దేశాలు మూడో డోసు అందించవచ్చని సూచించింది. అయితే, దీన్ని అమలు చేసే ముందు.. రెండు డోసులు ఎక్కువ మందికి చేరిన తర్వాత మాత్రమే మూడో డోసుపై ఆలోచించాలని పేర్కొంది. వ్యాక్సిన్‌ పంపిణీలో తొలుత వృద్ధులకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల బృందం సిఫార్సు చేసింది.

ఇక ఈ ఏడాది చివరినాటికి ప్రపంచవ్యాప్తంగా కనీసం 40శాతం మందికి రెండు డోసుల్లో వ్యాక్సిన్‌ అందించడంతో పాటు వచ్చే ఏడాది జూన్‌ నాటికి 70శాతం మందికి వ్యాక్సిన్‌ పూర్తిచేసేలా అన్ని దేశాలు ప్రయత్నించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చింది. వ్యాక్సిన్‌ పంపిణిలో వృద్థులకు, ఆరోగ్య కార్యకర్తలకు, అధిక ముప్పు పొంచివున్న వారికి తొలుత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. అనంతరం సాధారణ పౌరులకు, యుక్తవయసు వారికి వ్యాక్సిన్‌ ఇచ్చే క్రమాన్ని అనుసరించాలని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది.

ఇదిలాఉంటే, బూస్టర్‌ డోసు వినియోగంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా సిఫార్సు చేసినప్పటికీ.. ఇప్పటికే పలు దేశాలు మూడో డోసు పంపిణీ మొదలుపెట్టాయి. ఇజ్రాయెల్‌, అమెరికాతో పాటు యూరప్‌లోని పలు దేశాలు బూస్టర్‌ డోసును అందించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ముఖ్యంగా బ్రేక్‌త్రూ ఇన్‌ఫెక్షన్‌లు పెరగడం, కొత్త వేరియంట్‌లు పుట్టుకొస్తున్న నేపథ్యంలో బూస్టర్‌ డోసు ఇస్తున్నట్లు సమర్థించుకున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా బూస్టర్‌ డోసు వినియోగానికి సిఫార్సు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని