Rahul Gandhi: న్యాయ యాత్రలో రాహుల్ కారు అద్దం ధ్వంసం.. భద్రతా వైఫల్యమన్న కాంగ్రెస్‌

రాహుల్ గాంధీ(Rahul Gandhi) యాత్రలో భద్రతా వైఫల్యం చోటుచేసుకుందని కాంగ్రెస్ ఆరోపించింది. 

Updated : 31 Jan 2024 16:43 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) కారు అద్దం ధ్వంసమైంది. పశ్చిమ బెంగాల్‌లో జరుగుతోన్న భారత్‌ జోడో న్యాయ యాత్రలో భాగంగా వేలాదిమంది మద్దతుదారులు గుమిగూడటంతో ఈ ఘటన జరిగింది. దీనిపై కాంగ్రెస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

‘ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ర్యాలీలో పోలీసులందరూ బిజీగా ఉన్నారు. మా వద్ద అతి కొద్దిమంది సిబ్బంది మాత్రమే భద్రతా ఏర్పాట్లు చూస్తున్నారు’ అని హస్తం పార్టీ ఆరోపించింది. ఈ ఘటనను భద్రతా వైఫల్యంగా పేర్కొంది. అయితే ఆ సమయంలో రాహుల్ ఆ కారులో లేరు. బిహార్‌ నుంచి బుధవారం మరోసారి పశ్చిమ బెంగాల్‌లోని మాల్డాలోకి యాత్ర ప్రవేశించింది. ఆ సమయంలోనే కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రాహుల్ కాన్వాయ్‌పై రాళ్లు వేశారని ఆ పార్టీ నేత అధిర్‌ రంజన్ చౌదరి ఆరోపించారు. ఇదిలా ఉంటే.. లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ్ బెంగాల్‌లో కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని మమత ప్రకటించిన విషయం తెలిసిందే.

అదంతా డ్రామా: మమతా బెనర్జీ

ఈ ఘటనపై బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. రాహుల్‌ గాంధీ కారుపై బిహార్‌లో దాడి జరిగిందని, తమ రాష్ట్రంలో కాదని అన్నారు. ‘రాహుల్‌ కారుపై రాళ్ల దాడి జరిగిందని నాకు సమాచారం అందింది. వాస్తవంగా అసలు ఏం జరిగిందనేది నేను తెలుసుకున్నా. ఆ ఘటన బెంగాల్‌లో కాదు.. బిహార్‌లో చోటుచేసుకుంది. ధ్వంసమైన అద్దంతో ఆ కారు మా రాష్ట్రంలోకి ప్రవేశించింది. ఇదంతా ఓ డ్రామా’ అని వ్యాఖ్యలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని