Updated : 05 May 2022 15:54 IST

Ambidextrous: ఆ పాఠశాలలో అందరూ సవ్యసాచులే.. రెండు చేతులతో రాస్తారు మరి..

ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తున్న మారుమూల స్కూల్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాగా చదవాలి.. ఉత్తమ ర్యాంకు సాధించాలి.. ఏ పాఠశాలలోనైనా ప్రాథమిక అంశాలు ఇవే. కానీ మధ్యప్రదేశ్‌లోని ఓ స్కూల్‌ మాత్రం ఇందుకు డిఫరెంట్‌. ఆ పాఠశాలలో చేరితే రెండు చేతులతో రాయడం నేర్చుకోవాల్సిందే. ఇక్కడ ఇదే ప్రాథమిక అంశం. ఆధిపత్య హస్తం అనే భావనను సవాలు చేస్తూ.. రెండు చేతులతో రాయడం నేర్పిస్తున్న దేశంలోని ఏకైక పాఠశాలగా నిలిచింది సింగ్రౌలీ జిల్లాలోని వీణావాదిని పబ్లిక్ స్కూల్‌. మారుమూల బుధేలా గ్రామంలో ఉంటుందీ పాఠశాల.

దేశ తొలి రాష్ట్రపతి డా.రాజేంద్రప్రసాద్‌ రెండు చేతులతో రాసేవారు. పలు సందర్భాల్లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకున్న మాజీ సైనికుడు వీపీ.శర్మ రెండు చేతులతో రాయడం సాధన చేశారు. విజయవంతం కావడంతో ఈ విద్యను అనేక మందికి నేర్పాలని నిశ్చయించుకున్నారు. వీపీ.శర్మ సంకల్పంతో 1999లో ఆయన స్వగ్రామంలో ఏర్పాటైందే వీణావాదిని పబ్లిక్ స్కూల్‌.

1వ తరగతి నుంచే సాధన

1వ తరగతి నుంచే ప్రతి విద్యార్థి రెండు చేతులా రాసేలా సాధన చేయిస్తారు అక్కడి ఉపాధ్యాయులు. వారు మూడో తరగతికి వచ్చేలోపు పూర్తిస్థాయిలో సవ్యసాచిగా మారిపోతారని పాఠశాల గురువులు పేర్కొంటున్నారు. ఎలాంటి ఇబ్బంది, తడబాటు లేకుండా అలవోకగా ఒకేసారి రెండు చేతులతో రాస్తారని తెలుపుతున్నారు. ఎవరైనా విద్యార్థి కొత్తగా స్కూళ్లో చేరితే మొదటి నెల రోజులపాటు వారు ఏ చేతితో రాస్తారో, ఆ చేతితో రాసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తారు. అనంతరం మరో చేతితో రాయడంలో శిక్షణ ఇవ్వడం ప్రారంభిస్తారు. మరికొన్ని నెలల తర్వాత రెండు చేతులతో రాయడాన్ని సాధన చేయిస్తారు. ప్రతి 45 నిమిషాల క్లాసులో.. తప్పనిసరిగా 15 నిమిషాలను ఆ సబ్జెక్ట్‌లో రైటింగ్ ప్రాక్టీస్‌కే కేటాయిస్తారు.

6 విభిన్న భాషల్లో తర్ఫీదు

అంతే కాదండోయ్.. భాషల పట్ల మక్కువ పెంచేందుకు విద్యార్థులకు హిందీ, ఇంగ్లీష్‌, ఉర్దూ, సంస్కృతం సహా అరబిక్, రోమన్ వంటి ఆరు విభిన్న భాషల్లో రాయడం నేర్పిస్తున్నారు. స్కూల్‌లోని అనేకమంది విద్యార్థులు రెండు వేర్వేరు స్క్రిప్ట్‌లను ఒకేసారి, పూర్తిస్థాయి వేగంతో రాయగలరు. అదనంగా, విద్యార్థుల జ్ఞాపకశక్తి, ఏకాగ్రతకు పదును పెట్టేలా యోగాతోపాటు క్రీడలను పాఠ్యాంశాల్లో అంతర్భాగం చేశారు.

విద్యార్థులపై పరిశోధకుల అధ్యయనాలు

ఈ ప్రత్యేకమైన పాఠశాల దేశం దృష్టినే కాదు.. ప్రపంచ దేశాల శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షించింది. అమెరికా, జర్మనీ, దక్షిణ కొరియా వంటి దేశాల పరిశోధకులు ఈ స్కూల్‌ను సందర్శించి.. విద్యార్థులు నేర్చుకునే విధానం, వారి ప్రతిభాపాటవాలను తెలుసుకున్నారు. వీరిపై అధ్యయనం చేస్తున్నారు. సాధారణ పరీక్షలు, ఇతర పోటీ పరీక్షల్లోనూ మిగతా వారితో పోలిస్తే ఇక్కడి విద్యార్థులు మెరుగ్గా రాణిస్తుండటం విశేషం. ఇతర విద్యార్థుల కంటే అధిక వేగంతో రాస్తున్నారు. వీణావాదినిలో 8వ తరగతి వరకే ఉంటడంతో.. అక్కడ విద్య పూర్తిచేసుకొని ఇతర పాఠశాల్లో చేరినవారు పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని