RSS: జనాభా నియంత్రణ విధానాన్ని తీసుకురావాలి: మోహన్‌ భగవత్‌

భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) చీఫ్‌ మోహన్ భగవత్‌ ఆరోపించారు...

Published : 16 Oct 2021 07:18 IST

దిల్లీ: భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) చీఫ్‌ మోహన్ భగవత్‌ ఆరోపించారు. విజయదశమి సందర్భంగా నాగ్‌పూర్‌లోని ఆర్ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన అనంతరం సంఘ్‌ శ్రేణుల్ని ఉద్దేశించి ప్రసంగించారు. పాకిస్థాన్‌, తాలిబన్‌, ఉగ్రవాదం నుంచి జనాభా నియంత్రణ వరకు పలు అంశాలపై మాట్లాడారు. ఆరెస్సెస్‌ ఏటా నిర్వహించే ఈ వేడుకలకు ఈసారి ఇజ్రాయెల్‌ కాన్సులేట్‌ జనరల్‌ కొబ్బి షొషానీ అతిథిగా హాజరయ్యారు. 

ఆయన ప్రసంగంలోని కీలకాంశాలు..

* జనాభా నియంత్రణ విధానాన్ని మరోసారి తీసుకురావాల్సిన అసవరం ఉంది. వచ్చే 50 ఏళ్లను దృష్టిలో పెట్టుకొని దాన్ని రూపొందించాలి. ఇది అందరికీ సమానంగా వర్తింపజేయాలి. జనాభా అసమతుల్యత పెద్ద సమస్యగా మారింది. 

* జమ్మూకశ్మీర్‌లో ప్రజల్ని భయపెట్టడం కోసం ఉగ్రవాదులు హింసను ఆశ్రయిస్తున్నారు. 

* ఓటీటీ వేదికలపై నియంత్రణ లేకుండా పోయింది. కరోనా వెలుగులోకి వచ్చిన తర్వాత పిల్లల దగ్గర కూడా ఫోన్లు ఉంటున్నాయి. ఇది ప్రమాదకరం. మాదకద్రవ్యాల వినియోగం పెరిగిపోతోంది. ఇదో పెద్ద వ్యాపారంగా మారింది. దీని నుంచి వస్తున్న డబ్బును సంఘ విద్రోహ కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. దీన్ని నియంత్రించాల్సిన అవసరం ఉంది. 

* ‘స్వాధీనం నుంచి స్వతంత్రం’ వరకు సాగిన మన ప్రయాణం ఇంకా పూర్తి కాలేదు. భారతదేశ ఎదుగుదల, ఔన్నత్యాన్ని కొన్ని దేశాలు తమ స్వప్రయోజనాలకు అడ్డంకిగా భావిస్తున్నాయి. 

* తాలిబన్ల చరిత్ర మనకు తెలిసిందే. చైనా, పాకిస్థాన్ ఇప్పటికీ వారికి మద్దతునిస్తున్నాయి. ఒకవేళ తాలిబన్లు మారినా.. పాకిస్థాన్ మాత్రం మారదు. తాలిబన్ల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. భారతదేశంపై చైనా తీరేమైనా మారిందా? సరిహద్దు భద్రతను మరింత పటిష్ఠం చేయాల్సిన అసవరం ఉంది.

* మన సామాజిక స్పృహ ఇప్పటికీ కుల ఆధారిత వక్ర భావాలతోనే నిండి ఉంది. దీన్ని అధిగమించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని