Agnipath: ప్రధాని మోదీతో త్రివిధ దళాధిపతుల భేటీ

భారత సైన్యాధిపతి జనరల్‌ మనోజ్‌ పాండే, నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ హరికుమార్‌, ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వీఆర్‌ చౌధరీలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.

Published : 21 Jun 2022 22:16 IST

దిల్లీ: సాయుధ బలగాల్లో నియామకాల కోసం ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌ (Agnipath) పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతోన్న సంగతి తెలిసిందే. సైన్యంలో (Indian Army) సగటు వయసు తగ్గించేందుకే ఈ సంస్కరణలు తీసుకొస్తున్నామని వెల్లడించిన త్రివిధ దళాలు.. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశాయి. అయినప్పటికీ అగ్నిపథ్‌పై వివాదం నడుస్తోన్న నేపథ్యంలో త్రివిధ దళాధిపతులు నేడు ప్రధాని మోదీతో భేటీ అయ్యేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా భారత సైన్యాధిపతి జనరల్‌ మనోజ్‌ పాండే, నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ హరికుమార్‌, ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వీఆర్‌ చౌధరీలు ఈ సాయంత్రం ప్రధాని నివాసానికి చేరుకున్నారు. అగ్నిపథ్‌ పథకం అమలు, వీటిపై వస్తోన్న వ్యతిరేకత వంటి అంశాలపై తాజా పరిస్థితులను ప్రధానికి వివరించనున్నట్లు సమాచారం.

మరోవైపు ఇదే విషయంపై స్పందించిన జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్‌ డోభాల్.. ఎట్టిపరిస్థితుల్లోనూ అగ్నిపథ్‌ పథకంపై వెనక్కి వెళ్లేదే లేదని స్పష్టం చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ జరుగుతోన్న నిరసనల వెనుక స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయన్న ఆయన.. హింస, దాడులను ఉపేక్షించేదే లేదన్నారు. సమాజంలో ఘర్షణ వాతావరణాన్ని సృష్టించేందుకే కొంతమంది ఈ పథకాన్ని వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. అగ్నిపథ్‌ అనేది కేవలం ఒక స్వతంత్రమైన పథకం కాదని.. భారత్‌ను బలమైన, సురక్షితమైన దేశంగా తయారు చేసే క్రమంలో తీసుకుంటున్న చర్యల్లో ఇదీ ఒకటని ఉద్ఘాటించారు.

ప్రస్తుత కాలంలో యుద్ధ స్వరూపమే మారుతోందన్న అజిత్‌ డోభాల్.. రేపటి కోసం సన్నద్ధం కావాలంటే అందుకు ఇప్పటినుంచే మార్పు చెందాల్సిన అవసరం ఉందన్నారు. యుద్ధాల్లో సాంకేతికత వినియోగం గణనీయంగా పెరిగిపోయిందని, రానున్న రోజుల్లో కంటికి కనిపించని శత్రువుతో పోరాడాల్సి ఉంటుందన్నారు. ఈ క్రమంలో సాంకేతికత ఎంతో కీలకంగా మారిందన్నారు. అందుకోసం యువత, అత్యున్నత శిక్షణ కలిగిన సాయుధ బలగాలను సిద్ధం చేయాల్సి ఉందని అజిత్‌ డోభాల్‌ పేర్కొన్నారు. ఈ క్రమంలో సైన్యం మొత్తం అగ్నివీరులతో (Agniveer) నిండిపోదని.. రెగ్యులర్‌ సైనికులుగా ఎంపికైన అగ్నివీరులకు మరోసారి కఠిన శిక్షణ ఉంటుందని జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌ స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని